వంటింట్లో గ్యాస్‌ బండ.. సామాన్యుడి మెడకు గుదిబండలా మారుతోంది. అంతకంతకూ పెరుగుతున్న ధరతో.. ఇప్పటికే జనం ఇబ్బంది పడుతుంటే.. మరోసారి కేంద్రం భారీ షాకిచ్చింది. ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై 50రూపాయలు పెంచింది. ఈ కొత్తధర నేటి నుంచే అమల్లోకి వచ్చేసింది.

ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు... అనే సామెత పాతది. కష్టపడి కొనుక్కున్న వాటిని వండుకొని తినే పరిస్థితి కూడా సామాన్యుడికి లేదిప్పుడు. వంటకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్‌పై.. మరో యాభై రూపాయలు పెంచింది కేంద్రం. సామాన్యుడిపై మరింత భారం పెంచుతూ రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో సిలిండర్ ధర 769 రూపాయలకు చేరింది. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చేసింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న గ్యాస్‌బండ మరింత ధర పెరగడంతో పేదోడి నెత్తిన పిడుగు పడినట్టయ్యింది.

సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి, నెలవారీగా సవరిస్తూ ఉంటాయి. అయితే, అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్ల ఆధారంగా.. ఈ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా..  వినియోగదారు బ్యాంకు ఖాతాలో జమవుతోంది.అయితే, ఈ మధ్య సబ్సిడీ కూడా సరిగ్గా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి

సామాన్య ప్రజలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు.. సిలిండర్ రేటు కూడా భగ్గమంటోంది. తాజాగా దాని ధర మరోసారి భారీగా పెరిగింది. ఎల్పీజీ 14.2 కేజీల సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలలు ఏకంగా 50 రూపాయలు పెంచాయి. హైదరాబాద్‌లో సిలిండర్ ధర ప్రస్తుతం 771 రూపాయల 50పైసలుగా ఉంది. ఇప్పుడా ధర  821రూపాయలు దాటిపోయింది. ఒకప్పుడు 600లకు వచ్చే సిలిండర్.. 800 చెల్లించినా లభించని పరిస్థితి. దీంతో, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దేశంలో ఇతరనగరాల్లోనూ భారీగానే పెరిగింది. తాజా పెరుగుదలతో.. ఢిల్లీలో సిలిండర్ ధర 769 రూపాయలకు, బెంగళూరులో 772, చెన్నైలో 785, ముంబైలో 769, కోల్‌కతాలో 795 రూపాయలకు చేరింది. ఇక సిలిండర్ ధరలతో పాటు వాహనాల ఇంధన ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర కొన్ని చోట్ల వంద దాటేసింది.  డీజిల్ ధర కూడా పరుగులు పెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: