మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ వేగంగా పావులు క‌దుపుతున్నారు. కేసీఆర్ వ్యూహాల‌కు ఎత్తుకుపైఎత్తు వేస్తూ త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో ఈట‌ల భేటీ అయ్యారు. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీలో చేర‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని ఈట‌ల వ‌ర్గీయులుసైతం భావిస్తున్నారు. జూన్ 2న కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆ రోజు రాజీనామా చేసేందుకు ఈట‌ల ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈట‌ల వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాస‌నకు గురైన నాటి నుండి ఈట‌ల ఏం చేద్దాం అన్న విష‌యంపై త‌న అనుచ‌రులు, శ్రేయోభిలాషుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. బీజేపీలోకి వెళ్లాల‌ని కొంద‌రు, కొత్త పార్టీ పెడ‌దామ‌ని కొంద‌రు సూచ‌న‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ల‌ను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు ఈట‌ల వ్యూహం ఏమిట‌న్న చ‌ర్చ‌సాగింది. తాజాగా వ‌రుస‌గా బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అవుతుండ‌టంతో ఆయ‌న బీజేపీలో చేరుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప్ర‌చారానికి ఈట‌ల ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని, ముహూర్తంసైతం ఫిక్స్ అయింద‌న్న వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈట‌ల సొంత పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే క‌ష్ట‌మైన‌ప‌ని. ఇప్ప‌టికే త‌న‌దైన వ్యూహాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌లను ఒంట‌రిని చేయ‌డంలో కేసీఆర్ స‌ఫ‌ల‌మ‌య్యాడు. మంత్రులు గంగుల‌, హ‌రీష్‌రావులు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టిసారించి పార్టీ నేత‌లంద‌రినీ ఈట‌ల‌వైపు వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేశారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాచేసి ఎలాగైనా గెలిచి సీఎం కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఈట‌ల.. ఆమేర‌కు అస్త్రాల‌ను సిద్ధంచేసుకుంటున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్ల‌కుండా ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేందుకు ఈట‌ల ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో త‌న‌కు మ‌ద్దుతు ఇవ్వాల‌ని బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను ఈట‌ల కోరుతున్నారు. అయితే పార్టీలో చేరితేనే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని బీజేపీ మెలిక పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై ఈట‌ల బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ విష‌యాన్ని ఈట‌ల‌సైతం వెల్ల‌డించారు. తాను బీజేపీలో చేర‌డం లేద‌ని, వారి మ‌ద్ద‌తు కోరుతున్నాన‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రాబోయే రోజుల్లో ఈట‌ల ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: