రాజకీయాల్లో నేతల మధ్య ఉండే లుకలుకలు ప్రత్యర్ధులకు బాగా ప్లస్ అవుతాయి. ఆ లుకలుకలని సెట్ చేసుకోకపోతే పార్టీలు నష్టపోతాయి. అలా నేతల వల్ల భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నష్టపోయేలా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీలో ఉండే లుకలుకలు మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి. మామూలుగా భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది.

ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ గంటా శ్రీనివాసరావు టీడీపీ తరుపున గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి గంటా నియోజకవర్గం మార్చేశారు. ఈయన విశాఖ నార్త్ నుంచి బరిలో దిగారు. దీంతో చివరి నిమిషంలో భీమిలి టికెట్ చంద్రబాబు, సబ్బం హరికి ఇచ్చారు. చివరిలో టికెట్ దక్కించుకోవడంతో సబ్బంకు విజయం దక్కలేదు. సబ్బంపై పది వేల ఓట్ల మెజారిటీతో అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఇప్పుడు ఆయన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. దీంతో భీమిలిలో ఆయనకు తిరుగులేకుండా పోయింది.

ఇక సబ్బం హరి మరణించడంతో భీమిలిలో టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు? అని టీడీపీ కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూశారు. చివరికి ఆనందపురంకు చెందిన కోరాడ రాజబాబుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. దీంతో నియోజకవర్గంలో అసలు రచ్చ మొదలైంది. భీమిలిలో సీనియర్ నాయకుడుగా ఉన్న అప్పలనాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు ఈయన భార్య టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్నారు.

భీమిలి టికెట్ తనకు కేటాయించకపోతే పార్టీ జంప్ అయిపోవడం ఖాయమని సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇక రాజబాబుకు ఇన్‌చార్జ్ పదవి ఇవ్వడంపై భీమిలి టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ గంటా నూకరాజు సైతం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. రాజబాబుని ఇంచార్జ్‌గా ప్రకటించిన దగ్గర నుంచి ఈయన సైలెంట్ అయిపోయి, పార్టీలో కనిపించడం లేదు. ఇలా టీడీపీలో లుకలుకలు తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం అవంతి శ్రీనివాస్‌కు కలిసొచ్చేలా ఉంది. వీళ్ళు ఇలాగే ముందుకెళితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అవంతికి గెలవడానికి ఛాన్స్ దొరికినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: