
మరో వైపు గత నాలుగు పర్యాయాలుగా హుజురాబాద్‌లో ఈటల గెలుపుతో ఎగిరిన టీఆర్‌ఎస్ జెండాను.. ఈసారి కూడా ఎలాగైనా హుజురాబాద్ గడ్డమీద ఎగుర వేయాలని కేసీఆర్ కసితో ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఉపఎన్నిక నోటిఫకేషన్‌కు ముందే హుజురాబాద్ ప్రజలపై కేసీఆర్ వరాలు కురిపించారు. మంత్రి హరీశ్‌రావు కూడా హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకు అహర్నిశలు కష్టపడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆలస్యంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపి ప్రచారంలో దూకుడు పెంచింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రచారం నిర్వహించారు.
అయితే హుజూరాబాద్‌లో ఇప్పటివరకు ఒకలెక్క.. ఇకపై ఓ లెక్క అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇకపై జరిగే ఘటనలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ఐదు నెలలుగా సాగుతున్న ప్రచారం ఒక ఎత్తయితే.. ఈ వారం రోజుల్లో జరిగే పరిణామాలు మరో ఎత్తు అంటున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నారు.