నెల్లూరు జిల్లా అంటే రాజకీయలకు పెట్టింది పేరు. అందులోనూ నెల్లూరు నగర రాజకీయం. అక్కడ జరుగుతున్న కార్పోరేషన్ ఎన్నిక. ఎవరికి బలం?  ఏ పార్టీ  కార్పోరేషన్ లో పాగా వేస్తుంది ? ఇక్కడి గెలుపు రాష్ట్ర రాజకీయలను ప్రభావితం చేస్తుందా ? ఇత్యాది ప్రశ్నలు ఎన్నోఇక్కడి రాజకీయలు తెలిసిన వారి మదిలో పుట్టుకు వస్తాయి. నెల్లూరు పంచాయితీ నుంచి, మున్సిపాలిటీ అక్కడ నుంచి నగర కార్పోరేషన్ గా క్రమ క్రమంగా ఎలా ఎదిగిందో ... ఇక్కడి రాజకీయాలు కూడా అంతే స్థాయిలో ఎదిగాయి.
నగర, జిల్లా, రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరోళ్లు తమ ప్రత్యేకతను చాటారు. ప్రస్తుతం చాటుతున్నారు. నవంబర్ 15న జరగనున్న ఎన్నిక  అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడి గెలుపుకోసం ప్రతి ఒక్కరూ పావులు కదుపుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
నగర రాజకీయాలలో గతంలో ఒక ఊపు ఊపిన ప్రజాప్రతినిధులు తాజాగా జరుగుతున్న ఎన్నికలలో కానరావడం లేదు.  గతంలో నెల్లూరు మున్సిపాలిటీ గా ఉన్నప్పుడు,  నగర పాలక సంస్థగా వృద్ధి చెందినప్పుడు ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు గానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి అనుచర గణం కానీ తాజా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కారణాలు అనేకం.
నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి ప్రత్యక గుర్తింపు ఉంది.  సుధీర్ఘ రాజకీయ అనుభవం  కలిగిన కుటుంబం కావడంతో నగరంలో వారికున్న పరిచయాలు, స్నేహితాలు మరెవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.  నెల్లూరు నగర కార్పోరేషన్ లోని ప్రతి గడపతోనూ ఆనం కుటుంబానికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే విషయం  ప్రతి రాజకీయ పార్టీ కూడా పేర్కోనే అంశం.  ఆ కుటుంబం నుంచి  దవంగత ఆనం వివేకానంద రెడ్డి  నగర రాజకీయాలలో తనదైమ ముద్ర వేశారు. ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి  అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.   ప్రస్తుతం వెంకట గిరి శాసన సభ్యుడిగా ఉన్నారు.  ప్రస్తుతం ఆ కుటుంబం నగర పాలక సంస్థ ఎన్నికలకు దూరంగాఉంది. వారి కుటుంబ సభ్యులు కానీ,  అనుచరర గణంగాని ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
తెలుగు దేశం పార్టీలో  దివంగత మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామా రావుకు అభిమాన పుత్రుడిగా పేరు తెచ్చుకున్న
మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి రాజకీయ జీవితం కూడా నెల్లూరు మున్సిపాలిటీతో  ఆంభమైంది. ఆయన నెల్లురు మున్సిపల్ చైర్మెన్ గా  పని చేశారు. ఆయన తరువాత ఆయన భార్య  తాళ్లపాక అనూరాధ కూడ మున్సిపల్ చైర్ పర్సన్ గాసేవలందించారు.  ఆ కుటుబం , వారి అనుచర గణం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అంతే కాక సినీ నటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ  గెలుచుకున్న స్థానాలలో నెల్లూరు నగరం కూడా ఒకటి.  ఆ పార్టీ నుంచి ఎం.ఎల్ ఏ గా గెలుపొందిన ముంగమూరు శ్రీదర్ కృష్ణా రెడ్డి రాజకీయ ప్రస్థానం నగర రాజకీయాలతోనే ఆరంభమైంది. ఆయన కూడా  ప్రస్తుతం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతంలో నెల్లూరు రాజకీయాలలో  తనదైన ముద్రను వేసిన నాటి తరం నేతలు ప్రస్తుతం  ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: