కరోనా మహమ్మారి రకరకాలుగా మ్యుటేట్ అవుతూ అందరినీ వణికిస్తోంది. తాజాగా ఇజ్రాయేల్ దేశంలో మరో కొత్త వేరియంట్ ను గుర్తించారు. గర్భంతో ఉన్న మహిళలో.. కరోనా, ఇన్ ఫ్లూయెంజా వైరస్ లతో కూడిన డబుల్ ఇన్ ఫెక్షన్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. రెండు వైరస్ లు కలిసి ఎటాక్ చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ కొత్త రకం కరోనా వేరియంట్ కు ఫ్లోరోనా అని పేరు పెట్టారు. మనుషుల్లో దీని ప్రభావంపై పరిశోధనలు చేస్తున్నారు.

అయితే కరోనాకు అంతం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. టీకలు పోగేసుకుంటూ, జాతీయవాదం పేరుతో అలానే ఉండిపోవద్దని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. టీకాలతో అసమానతల కారణంగా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అసమానతలు తొలగిస్తే.. కరోనాకు అంతం అంటూ స్పష్టం చేశారు.

ఇక మన దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో మహారాష్ట్రలో 9వేల 170కొత్త కరోనా కేసులు, 6ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 2వేల 435, పశ్చిమ బెంగాల్ లో 4వేలే 512, ఢిల్లీలో 2వేల 716 కొత్త కేసులొచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు మహారాష్ట్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు 10మంది మంత్రులు, 20మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఇటీవల 5రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వీరంతా కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుండగా.. సిబ్బందితో కలిపి మొత్తం 50మందికి కరోనా సోకింది. అటు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. మరిన్ని ఆంక్షలు విధించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పారు.  









మరింత సమాచారం తెలుసుకోండి: