రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. మరో వారం తర్వాత ప్రతి రోజు 100 కేసులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కరోనా ఆంక్షలేవి అమలులో లేవని.. ఇకనుంచి విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు అన్నింటిలోను ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు. ఐటీ, ఇతర సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఎత్తివేసి ఆఫీసులు ఓపెన్ చేయాలని సూచించారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, వెంటనే వాటిని బంద్ చేసి ఫిజికల్  క్లాసులు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పోయినేడాది డిసెంబర్ 28న మొదలైందని నెలన్నరలోనే ముగిసిందని తెలిపారు. జనవరి 25న అత్యధికంగా 4559 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని చెప్పారు.

 థర్డ్ వేవ్ లో 28 రోజుల్లోనే పీక్ స్టేజ్ నమోదైందన్నారు. ఈసారి వైరస్ కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగపడ్డదన్నారు. టీకా తీసుకోలేని వాళ్లలో 2.8 శాతం మంది ఆసుపత్రిలో చేరగా, టీకా తీసుకున్నవారిలో  ఒక శాతం మంది మాత్రమే ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. ఇప్పుడున్న అంచనాల మేరకు ఇంకొంత కాలం వరకు కొత్త వేరియంట్ లు పుట్టే అవకాశం లేదని, ప్రజలు సాధారణ జీవితం గడపొచ్చునని డిహెచ్ చెప్పారు. పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్, ఎపిడమాలజిస్టులు మూడు రకాల అంచనాలు వేశారని తెలిపారు. కరోణా పూర్తిగా ఎండమిక్ గా మారిపోయి సాధారణ సీజనల్ ఫ్లూ గా మిగిలిపోవడం ఒకటైతే, కొంత మందిలో కొత్త వేరియంట్ లు ఇమ్యూనిటీని తగ్గించి మాటిమాటికీ వైరస్ బారిన పడేలా చేయడం మరొకటని అన్నారు. ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ దాటి ఇన్ఫెక్ట్ చేసే కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు.

 అయితే అవన్నీ వీక్ వేరియంట్లయ్యే ఛాన్స్ ఉందన్నారు. అన్ని రకాల వెరియంట్ల కు పనిచేసే వ్యాక్సిన్ ల తయారీ కోసం ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయని, అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కరోనా గురించి భయపడకుండా భక్తులందరూ మేడారం జాతరకు వెళ్లాలని డిహెచ్ సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లను, సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: