ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చేజిక్కించుకునేందుకు రష్యా అధ్యక్షుడు సరికొత్త వ్యూహం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విదేశాలకు చెందిన 16వేల మంది ఫైటర్లను ఉక్రెయిన్ లో దించేందుకు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. వీరు మధ్య ఆసియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలపై పోరాడిన వారు. ఈ బలగాలు రష్యా అనుకూల సిరియా నుంచి రానున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఖర్కీవ్ లోని అణు పరిశోధన కేంద్రంపై రష్యా దాడి చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది.

ఉక్రెయిన్ నగరాలపై రష్యా యుద్ధ తీవ్రతను పెంచింది. ఖెర్సాన్, ఖార్కివ్, చెర్నిహవ్ నగరాలతో పాటు నైపర్ నది సమీపంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన నిప్రోపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో పలువురు ఉక్రెయిన్ పౌరులు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన నిప్రోపై దాడులు చోటు చేసుకోవడంతో.. మిగతా పట్టణాల్లోని పౌరులు హడలెత్తిపోతున్నారు.

అంతేకాదు ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. పది మంది బృందం.. మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ఇవాన్ ఫెడరోవ్.. రష్యా సైన్యానికి సహకరించడానికి నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని జెలెన్ స్కీ చెప్పారు. రష్యా చర్య యుద్ధ నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సేనలు ఆశించిన రీతిలో ఫలితాలు రాబట్టకపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్ ను కోల్పోయిన తరుణంలో.. పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 8మంది మేజర్ జనరల్స్ తో పాటు వ్యూహాత్మక పొరపాట్లు జరిగినందుకు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లో ఉన్న వారిపై పుతిన్ వేటు వేశారు.

అంతేకాదు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు ఎత్తివేయకుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూలిపోతుందని రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రి హెచ్చరించారు. ఐఎస్ఎస్ ను నివాసయోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్ ను యూఎస్ నిర్వహిస్తుంటే... అది కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్ సిస్టమ్ ను రష్యా పర్యవేక్షిస్తోంది. దీనికి రష్యా సహకారాన్ని ఆపేస్తే.. స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగుతుందని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు.








మరింత సమాచారం తెలుసుకోండి: