రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ కొట్టిన దెబ్బనుండి నాన్ ఎన్డీయే పార్టీలు ఇంకా కోలుకున్నట్లు లేదు. రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము పోటీచేస్తున్నారు. ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యాశ్వంత్ సిన్హా రంగంలోకి దిగారు. అయితే సిన్హాకు నాన్ ఎన్డీయే పార్టీల నుండి పూర్తి సహకారం అందుతున్నట్లు లేదు. కారణం ఏమిటంటే మోడీ చాతుర్యమే కారణమని చెప్పాలి.






ద్రౌపది ముర్మును పోటీలోకి దించటంలోనే మోడీ చాతుర్యం తెలిసిపోతోంది. కారణం ఏమిటంటే ద్రౌపది గిరిజన నేత. రెండుసార్లు ఎంఎల్ఏగా మంత్రిగా ఎంపీగా చేశారు. తర్వాత జార్ఖండ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. కాబట్టి ద్రౌపది అంటే పార్టీలకు అతీతంగా గిరిజన ప్రజాప్రతినిధుల్లో సానుకూలత పెరిగిపోతోంది. యూపీఏలోని భాగస్వామ్యపార్టీలే ద్రౌపదికి జై కొట్టాయి. దాంతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి దిక్కుతోచటంలేదు. బహుశా సిన్హా కూడా అనవసరంగా పోటీలోకి దిగినట్లు అనుకుంటున్నారేమో.






సీన్ కట్ చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరుండాలనే విషయంలో మూడుసార్లు సమావేశమైన నాన్ ఎన్డీయే పార్టీలు ఇపుడసలు మాటే లేకుండా పడున్నాయి. సోనియా, రాహుల్, మమత, కేసీయార్, శరద్ ఎవరు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి నోరెత్తటంలేదు. రాష్ట్రపతి అభ్యర్ది విషయంలో తగిలిన షాక్ నుండి వీళ్ళింకా కోలుకున్నట్లు లేదు. అందుకనే సమావేశం కాదుకదా కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు.






వీళ్ళ వరస చూస్తుంటే ఉపరాష్ట్రపతి పోటీలో అభ్యర్ధిని నిలిపే ఉద్దేశ్యం కూడా ఉన్నట్లు కనబడటంలేదు. పోటీకి నిలపాలంటే అధికార పార్టీల కూటమికి సమానంగా ఢీ కొనే సామర్ధ్యం ఉండాలి. కానీ ఇక్కడ నాన్ ఎన్డీయే పార్టీలకు అంత సీన్ లేదు. మరలాంటపుడు ఇక మోడీకి వ్యతిరేకమనే పేరుతో ఊరికే రచ్చ చేయటం ఎందుకు ? రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తత్వం అందరికీ బోధపడినట్లుంది. అందుకనే ఇపుడు చప్పుడు కూడా చేయటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: