మార్గదర్శి, ఈనాడు సంస్ధల ఛైర్మన్ రామోజీరావును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విడవకుండా వెంటాడుతున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతు మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావుదా కాదా అన్న విషయం తేలాలన్నారు. రామోజీకి సంబంధించిన అనేక విషయాలపై తొందరలోనే తాను ఒక పుస్తకం రాయబోతున్నట్లు చెప్పారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రామోజీ చిట్ ఫండ్ వ్యాపారం చేయకూడదన్నారు. అయితే అన్నీ నిబంధనలను రామోజీ కాలరాసి తనిష్టం వచ్చినట్లు వ్యాపారాలు చేస్తున్నట్లు మండిపోయారు.

చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఇంకే విధమైన వ్యాపారాలు చేయకూడదనే నిబంధన కచ్చితంగా ఉందన్నారు. ఎందుకంటే చిట్ ఫండ్ ద్వారా వచ్చే నిదులను ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించే అవకాశాలున్నాయి కాబట్టే అన్నారు. మిగిలిన వ్యాపారాల్లో నష్టాలు వస్తే దాని ప్రభావం కచ్చితంగా చిట్ ఫండ్ వ్యాపారం మీదపడి అంతిమంగా డబ్బులు పెట్టినవాళ్ళు నష్టపోతారని ఉండవల్లి చెప్పారు. కానీ రామోజీ ఆధ్వర్యంలో చిట్ ఫండ్ వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు.

కేసు విచారణలో భాగంగా ఒకసారి మార్గదర్శి చిట్ ఫండ్స్ తనదే అని ఒకసారి తనదికాదని మరోసారి రామోజీ కోర్టుకు చెప్పినట్లు ఉండవల్లి అన్నారు. అలాగే రామోజీతో తమ సంస్ధకు ఎలాంటి సంబంధంలేదని మార్గదర్శి యాజమాన్యం చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్ధ బ్యాలెన్స్ షీటులో ఛైర్మన్ గా రామోజీనే సంతకం చేసిన విషయాన్ని మాజీ ఎంపీ గుర్తుచేశారు.

అందుకనే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్ధ అసలు రామోజీదా కాదా అన్న విషయం తేలాలన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిపెట్టాలని ఉండవల్లి కోరారు. ఒకసారి ఈ కేసును ప్రభుత్వం గనుక గట్టిగా దృష్టిపెడితే అనేక సంచలన విషయాలు బయటకు వస్తాయని కూడా చెప్పారు. మరి ఉండవల్లి చెప్పిన మాటలు ప్రభుత్వం బుర్రలోకి ఎక్కుతుందా ? ఎప్పటికైనా ఉండవల్లి పోరాటం ఫలిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: