ఎంఎల్ఏలు, ఎంపీల కొనుగోళ్ళల్లో ఇద్దరికి ఇద్దరు ఒకటే. ఎంఎల్ఏల కొనుగోళ్ళలో కేసీయార్ ఒకపద్దతి అయితే ఎంఎల్ఏలతో పాటు ఎంపీలను కూడా బీజేపీ కొంటోంది. కేసీయార్ అయినా బీజేపీ అయినా ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిడిపెట్టి, కేసులతో భయపెట్టే ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను లొంగదీసుకుంటున్నారు. ప్రాంతీయపార్టీ కాబట్టి డైరెక్టుగా కేసీయారే పిక్చర్లో కనిపిస్తున్నారు. జాతీయపార్టీ కాబట్టి నరేంద్రమోడీ, అమిత్ షా కాకుండా పార్టీ కనబడుతోంది.

2014లో 62 సీట్లతో అధికారంలోకి వచ్చిన కేసీయార్ తన ప్రభుత్వాన్ని సుస్ధిరం చేసుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను రకరకాల మార్గాల్లో లాక్కున్నారు. వీరిలో కొందరికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. అడిగిన వారికి వ్యాపారాలు, డబ్బు, పదవులు ఆశచూపి లొంగదీసుకున్నారనే ఆరోపణలకు కొదవేలేదు. ఇదే పద్దతిని ఏపీలో చంద్రబాబునాయుడు కూడా అమలుచేశారు. తెలంగాణాలో కేసీయార్ వైఖరిపై అమ్మనాబూతులు తిట్టిన చంద్రబాబు ఏపీలో అదేపనిచేశారు.

ఇక జాతీయస్ధాయిలో బీజేపీ కూడా ఇదేచేసింది. ప్రతిపక్షాలకు చెందిన ఎంతోమంది ఎంఎల్ఏలను, ఎంపీలను లాగేసుకున్నది. అధికారానికి దగ్గరగా ఉన్న మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అయితే హోల్ సేల్ గా ఎంఎల్ఏలను లోబరుచుకుని ప్రభుత్వాలనే ఏర్పాటుచేసింది. ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు లేదా ఎంపీలు బీజేపీలోకి ఎందుకు చేరుతున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు. ఇపుడు తెలంగాణాలో బయటపడిన ఎంఎల్ఏల ఎర కేసులో ఇటు కేసీయార్ అటు బీజేపీ నేతలు చాలా అమాయకత్వాన్ని నటిస్తున్నారు. ఇద్దరుకూడా గొంగట్లో కూర్చునే భోజనంచేస్తున్నారు. మరలాంటపుడు అన్నంలో గొంగళి రాకుండా ఎలాగుంటుంది.

బయటకు ఇద్దరు నీతులు చెబుతున్నారు కానీ లోలోపల చేసేది, చేస్తున్నది మాత్రం ఒకేరకమైన పని. కాకపోతే దొరికన వాళ్ళు దొంగలంతే. అయినా బీజేపీకి బుద్ధిలేదు కాబట్టే టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోళ్ళ వ్యవహారాన్ని హైదరాబాద్ లోనే పెట్టుకుంటుందా ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుకుంటే దొరికే అవకాశాలు లేవు. అపుడు కేసీయార్ లాగే బీజేపీ నేతలు కూడా దొరల్లాగే ఉండచ్చు. తెలివితక్కువగా వ్యవహరించి ఇపుడు లేనిపోని చెత్తనంతా కమలనాదులు నెత్తినేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: