కొన్ని నియోజకవర్గాలతో పాటు పార్టీలో పెరిగిపోతున్న గందరగోళానికి చంద్రబాబునాయుడే కారణమవుతున్నారు. క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసేసుకోవటం తర్వాత తీరిగ్గా వాటిని సమీక్షించటంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ముందు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన చంద్రబాబు రివర్సులో నడుస్తున్నారు. అందుకనే నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గమే.





ఇంతకీ విషయం ఏమిటంటే విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గానికి ఇన్చార్జిగా బంగర్రాజును చంద్రబాబు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే దశాబ్దాలుగా ఇక్కడ ఇన్చార్జిగా పతివాడ నారాయణస్వామి నాయుడే ఉన్నారు. పతివాడంటే చిన్న లీడర్ కాదు. 1983 నుండి 2004 వరకు అంటే ఆరుసార్లు ఓటమన్నదే లేకుండా గెలిచిన నేత. 2014లో గెలిచి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 75 ఏళ్ళు దాటిన పతివాడ పార్టీలో చురుగ్గానే తిరుగుతున్నారు.





ఇలాంటి నెల్లిమర్లకు చంద్రబాబు ఉన్నట్టుండి బంగర్రాజును ఇన్చార్జిగా నియమించేశారు. దాంతో పతివాడకు మండిపోయింది. ఎందుకంటే కొత్త నేతను ఇన్చార్జిగా నియమించే ముందు చంద్రబాబు పతివాడకు ఒక్కమాట కూడా చెప్పలేదు. దాంతో పతివాడ వర్గమంతా బంగార్రాజును దూరంపెట్టేసింది. బంగార్రాజు ఇంటికొస్తే మాట్లాడటానికి కూడా పతివాడ ఇష్టపడలేదు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని బంగార్రాజు ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పుకున్నారు.





విషయం అర్ధమైన వెంటనే పతివాడను చంద్రబాబు ఇపుడు బతిమలాడుకుంటున్నారు. ఎప్పుడైతే తనతో చంద్రబాబు మాట్లాడారో నెల్లిమర్లకు తానే ఇన్చార్జినని పతివాడ చెప్పుకుంటున్నారు. దాంతో నియోజకవర్గంలో గందరగోళం పెరిగిపోతోంది.  ఇదే విధమైన పరిస్ధితి తుని, పీ గన్నవరంలో కూడా కనబడుతోంది. తునిలో యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను ఇన్చార్జిగా ప్రకటించినా ఇంకా యనమల కృష్ణుడే తిరుగుతున్నారట.






అలాగే పీ గన్నవరంలో బాధ్యతలు ఇద్దరు నేతలకు అప్పగిస్తే మూడో నేత జోరుగా తిరుగుతున్నారట. దీనికి కారణం ఏమిటంటే తనను ఎవరు కలిసినా నియోజకవర్గంలో బాగా పనిచేసుకోండని చంద్రబాబు చెబుతుండటమే అని తమ్ముళ్ళంటున్నారు. చంద్రబాబు ఆలోచనలు ఏమిటో తెలీదు కానీ పార్టీలో గందరగోళం మాత్రం పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: