హైదరాబాద్: రాష్ర్టంలో మధ్యంతర ఎన్నికలు ఏమైనా ముంచుకొస్తున్నాయా? అంటే ఆయా రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనీ ఒకరంటుంటే...మరో నాయకుడు ఏకంగా వరాలనే కురిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు 20నెలల టైం వుంది. కానీ, రాష్ర్టంలోని అన్ని ప్రధాన పార్టీలలో మాత్రం ఎన్నికల వాతావరణం అగుపిస్తోంది.  మొన్నటి వైఎస్ఆర్ సీపీ సమావేశంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనీ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఎన్నికల వరాలను కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 100సీట్లు, 10వేల కోట్ల రూపాయలతో బీసీలభ్యున్నతీ కోసం ఉప ప్రణాళికను ముందుస్తుగానే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఉపకార వేతనాలు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఒక్కటేమిటి అనేక వరాలను వరుస పెట్టి ప్రకటించారు.  ఇవే కాకుండా 2009 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన వరాలకంటే మరిన్నింటిని జోడించారు. ఒక్క సీట్లు, నోట్ల ముచ్చటనే కాదు బాబు తన మదిలో ఉన్న అనేక పథకాలను వివరించారు. ఎన్నికల వేళ ప్రకటించాల్సిన వరాలన్నింటిని ఇప్పుడే ప్రకటించడంతో రాష్ర్టంలో ముందస్తు ఎన్నికలేమైనా వస్తాయా? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్క బీసీల గురించి కాదు, అన్ని వర్గాలను తనవైపు ఆకర్షించుకోవడానికి ఎన్నో పథకాల గురించి చెప్పారు.  2009లో కూడా ఇలాంటి జనాకర్షక పథకాల గురించి బాబు చెప్పారు. కానీ, ప్రజలు నమ్మలేదు. ఉప ఎన్నికల్లో మరెన్నో చేస్తామన్నారు. ప్రజలు విశ్వసించలేదు. తాజాగా ప్రజల్ని తనవైపు తిప్పుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. వానకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా వరుణదేవుడు కరుణ చూపలేదు కాని, చంద్రబాబు మాత్రం రాష్ర్ట ప్రజలపై ఎనలేని కరుణ చూపెడుతున్నారు. ప్రజలు అడగక్కుండానే వరాలు కురిపిస్తున్న తీరుపై వాడివేడిగా చర్చ జరగుతోంది. అడగక్కుండానే వరాలజల్లు కురిపించడం వెనక పెద్ద మతలబు దాగి వుందంటున్నారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి రాష్ర్టంలో ముఖ్యంగా బీసీ వర్గాలు పూర్తిగా అండగా ఉంటూ వస్తున్నాయి. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలు దూరమవుతూ వస్తున్నాయి. బాబు హయాంలో కులవ్రుత్తులు పూర్తిగా కనుమరుగయ్యాయి. వారిని ఆకట్టుకోవడం కోసం ‘ఆదరణ’ వంటి పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ, 2004 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో నగదు బదిలీ వంటి కోటి వరాలు ప్రకటించారు. ప్రజలు రెండో‘సారీ’ ఆదరించలేదు. ఉప ఎన్నికల సంగతి తెల్సిందే.  ఇప్పుడు తాజాగా పార్టీకి దూరమవుతున్న వర్గాలను దగ్గర చేసుకునే నిమిత్తం కొత్త పథకాలకు తీసుకువస్తున్నారు. అన్ని వర్గాలు వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుసుకున్నారు బాబు. ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ వర్గాలను తిరిగి దగ్గరకు తెచ్చుకోవడానికి బాబు పడరాని పాట్లుపడుతున్నారు. బీసీలతో పాటు పార్టీకి దూరమైన అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడానికి ఎన్నో వరాలు ప్రకటిస్తున్నారు. పార్టీ వరుసగా ఘోరపరాజయాలపై రెండ్రోజులుగా జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి వెన్నదన్నుగా నిలిచిన వర్గాలన్నింటికి తిరిగి పెద్దపీట వేసేందుకు సీట్లు ఇస్తామంటున్నారు. వేల కోట్ల ప్యాకేజీల ఆశ చూపెడుతున్నారు.  అయితే, అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా, ముఖ్యంగా కులవ్రుత్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారనీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు క్రిష్ణయ్య వంటి నేతలు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో దాదాపుగా ఇదే అర్థం వచ్చే విధంగా టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కూడా మాట్లాడారు. మొత్తానికి వరుసగా రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన చంద్రబాబుకు ఇప్పుడు అన్ని వర్గాలు గుర్తుకొస్తున్నాయి.  ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారా? లేక 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, 2010,2011,2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరిగా ప్రజలు బాబు మాటల్ని పెడచెవిన పెడతారా? అనేది కాలమే నిర్ణయించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: