భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ గా అభిమానులు పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండుల్కర్ మార్ థాన్ ఇన్నింగ్స్ లకు బ్రేక్ పడింది. దాదాపు 23 ఏళ్ల పాటు వన్డే క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్... కలర్ డ్రెస్సుల మ్యాచ్ లకి గుడ్ బై చెప్పాడు. వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉండడం తన అదృష్టమని సచిన్ చెప్పాడు. టెస్టుల్లో ఇంకా కొనసాగుతానని... తనకు అండగా నిలిచిన సహచరులు, బీసీసీఐ సభ్యులు, క్రికెట్ అభిమానులకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇప్పటివరకు 463 వన్డేలాడిన మాస్టర్.... 452 ఇన్నింగ్స్ ల్లో 18426 పరుగులు చేశాడు. 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చూసిన ఈ క్రికెట్ దేవుడు ఎన్నో రికార్డులను సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా రెండేళ్ల కిందటే రికార్డు సృష్టించాడు. బ్యాట్ తోనే కాకుండా బంతితోనూ మాస్టర్ రాణించాడు. ఇప్పటివరకు ఆడిన వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు.
16 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ తో తన వన్డే కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో... చివరి వన్డే కూడా పాకిస్థాన్ పైనే ఆడాడు. వన్డేలనుంచి తప్పుకుంటున్నట్టు సచిన్ చేసిన అభ్యర్థనను బిసీసీఐ ధృవీకరించింది. సచిన్ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ సెలక్టర్ శ్రీకాంత్ అన్నాడు. సచిన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని బిసీసీఐ తెలిపింది. మొత్తానికి పాకిస్తాన్ తో సిరీస్ కు ముందుగానే మాస్టర్ రిటైర్మెంట్ ప్రకటించడం వరల్డ్ క్రికెట్ లోహాట్ టాపిక్ అయ్యింది.
మరింత సమాచారం తెలుసుకోండి: