హైదరాబాద్: ఇదో పోలీస్ అధికారి అరాచకం. కాదు కాదు ఘాతుకం. తనతోటి అధికారి ఆరోగ్యం క్షీణించాలంటూ ఏకంగా క్షుద్ర పూజల్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మరో ఐపీఎస్ అధికారి ఆరోగ్యం క్షీణించాలంటూ అరాచకానికి పాల్పడటం పోలీస్ శాఖను కుదిపేస్తోంది. మూఢనమ్మకాలు నమ్మొద్దంటూ పోలీసులు ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడం చూస్తుంటాం. కానీ, ఇందుకు పూర్తి విరుద్దంగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రాష్ర్ట డీజీపీ దినేష్ రెడ్డి ఆరోగ్యం క్షీణించాలంటూ క్షుద్రపూజలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ర్ట చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మరో ఐపీఎస్ అధికారి ఆరోగ్యం క్షీణించాలంటూ క్షుద్రపూజలు చేయడం ఇదే మొట్ట మొదటి సారిగా చెప్పవచ్చు.
సదరు ఐపీఎస్ అధికారి నిర్వహించిన క్షుద్రపూజలపై నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. పోలీస్ శాఖలో కలకలం రేపి, రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు వివరాల్లోకి వెళ్లితే...ఫోర్జరీ సంతకం కేసులో ఓ సీనియర్ పోలీస్ అధికారి కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న విషయం విధితమే. డిజిపి దినేష్ రెడ్డి వల్ల తనకు రావల్సిన ప్రమోషన్లీ దక్కకుండా పోతున్నాయంటూ సదరు అధికారి గత కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ ఎంపీ సంతకం ఫోర్జరీ చేసీ ఢిల్లోని సంబంధిత మంత్రికి లేఖను రాశారు.
ఇది ఫోర్జరీ సంతకమని తేల్చిన అధికారులు ఆ అధికారిపై కేసును నమోదు చేశారు. ఇప్పుడు కోర్టులో విచారణ సాగుతోంది. కోర్టులో విచారణ సాగుతున్న క్రమంలో సదరు ఐపీఎస్ అధికారి డిజిపి దినేష్ రెడ్డి ఆరోగ్యం క్షీణించాలంటూ ఎల్బీనగర్ ప్రాంతంలోని ప్రత్యీంగారిదేవి ఆలయంలో క్షుద్ర పూజలను నిర్వహించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రక్త మాంసాలతో క్షుద్రపూజలు చేసినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. దేవాలయ ఆవరణలో రక్తమాంసం ముద్దలతో పాటు నిమ్మకాయలు కూడా దొరికాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ క్షుద్ర పూజలపై డిజిపి కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది.
దేవాలయంలో క్షుద్ర పూజలు చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలడంతో ఎల్బీనగర్ పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. మొత్తానికి పోలీస్ అధికారి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సదరు అధికారి మెడకు మరో కేసు చుట్టుకోవడం ఖాయమనీ చెప్పొచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: