హైదరాబాద్: రాష్ర్ట గవర్నర్ నరసింహాన్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. నూతన రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఢిల్లీ కి వెళ్తున్నారు. పనిలో పనిగా రాష్ర్టంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కాంగ్రెస్ పెద్దల్ని కలిసి వివరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కొత్తగా ఎన్నికైన రాష్ర్టపతికి కేంద్ర హెం శాఖ తెలంగాణపై ఓ నివేదికను సమర్పించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు వల్ల అంతరాష్ర్ట జల వివాదాలతో పాటు అనేక సమస్యలు తలెత్తె ప్రమాదం ఉందంటూ కేంద్ర హెంశాఖ రూపొందించిన నివేదికను రాష్ర్టపతికి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.  సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ను క్లిష్ట పరిస్థితుల్లో రాష్ర్ట గవర్నర్గా నియమించిన విషయం విధితమే. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడుగా కేంద్రానికి చేరవేస్తున్నాడు. అంతే కాకుండా, శాంతిభద్రతల విషయంలో ఎలా వ్యవహారించాలనేదాని గురించి కూడా ముఖ్యమంత్రికి, డీజీపీకి ఎప్పటికప్పుడూ సూచనలు,సలహాలా ఇస్తున్నట్లు కూడా ప్రచారం వుంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్టాన్ని పరోక్షంగా గవర్నర్ నరసింహాన్ నడిపిస్తున్నాడనీ, గవర్నర్ ఉన్నన్ని రోజులు తెలంగాణకు అన్యాయమే జరుగుతుందనీ తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీలతో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అనేక పర్యాయాలు ఆరోపించారు. ప్రస్తుతం కూడా తెలంగాణ అంశానికి సంబంధించి ఢిల్లీలో కదలికలు జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణపై సీమాంధ్ర నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో మరోమారు తెలంగాణవాదులు ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. ఆగస్టు నెలలో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సెప్టెంబర్లో తెలంగాణ మార్చ్ను నిర్వహించేందుకు తెలంగాణ రాజకీయ జేఏసీ సన్నద్దమవుతోంది. ఉద్యమం ఉధ్రుతమైతే తలెత్తే పరిణామాలు, తాజా రాజకీయాల గురించి గవర్నర్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశాలు లేకపోలేదనీ తెలుస్తోంది. ఉద్యమం మళ్లీ చేస్తామనీ తెలంగాణ వాదులు ప్రకటించిన ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన రాష్ర్టపతి ముఖర్జీకీ తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర హెంశాఖ నివేదికను ఇవ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమనడం...తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన గవర్నర్ ‘మర్యాద’ పేరిట ఢిల్లీకి వెళ్తుండటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.  గవర్నర్ ఢిల్లీ పర్యటనపై అన్ని పార్టీలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఢిల్లీ పెద్దలకు గవర్నర్ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి నివేదికలు ఇవ్వబోతున్నారు అనే దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: