ఖరీఫ్ పంటల సాగుపై అన్నదాత పెట్టుకున్న ఆశలు ఆడియాసలవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న రాష్ర్టంలో సరైన వర్షాలు కురవడంలేదు. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో అన్నదాత చేసేదిలేక దిక్కులు చూస్తూ దిగాలు పడుతున్నాడు. మరో వైపు విత్తనం వేసనా పొలాల్లో కూడా నేలలో తగినంత తేమ లేక విత్తనాలు పొక్కిపోతున్నాయి. మొలకెత్తాల్సిన పొలాలు సాగులేక ఖరఫ్ సీజన్ వెలవెలబోతోంది. ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాల్లో లేత దశలో ఉన్న పత్తిమొక్కలు వాడిపోతున్నాయి. సకాలంలో ఈ పాటికి వర్షాలు పడివుంటే వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండేవి. ఇటు వర్షాలు లేక పంటలు సాగవక పనులు లేక కూలీలు ఉసూరుమంటున్నారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ లో 80 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ ప్రారంభం నుండి ఈ పాటికి అన్ని రకాల పంటలు కలిపి 40 లక్షల హెక్టార్లలోపు సాగు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 28 లక్షల హెక్టార్లలోపు మాత్రమే సాగు కావడంపై వ్యవసాయాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుకావాల్సిన కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, తదితర పంటల సాగు విస్తీర్ణం కూడా మందగించింది. క్యాచ్ మెంట్ ఏరియాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో రాష్ర్టంలోని ప్రధాన జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ భారీగా పడటంలేదు. ఆగస్టులో సైతం ఇదే పరిస్థితి నెలకొంటే వేసని పంటలు కూడా చేతికి దక్కే అవకాశాలు లేవు. మరో వైపు ప్రాజెక్టుల్లోకి వర్షపు నీరు చేరకపోతే వరిసాగు కూడా ప్రశ్నార్దకమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: