హైదరాబాద్: మేలుకొలుపు పేరిట రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్,టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన దీక్ష కాస్త ఉసిగొలిపే విధంగా మారుతుందా? అంటే, ఆయన మాటలు ఔననే సమాధానమిస్తున్నాయి. సీమ కోసం 92గంటల దీక్షను చేపట్టిన సందర్భంగా బైరెడ్డి నోట వచ్చిన మాటలు ప్రజల్లో మరింత మనస్పర్ధలు,అగాధం ,రెచ్చిపోయే విధంగా ఉన్నాయి. రాయలసీమ రాష్ర్టాన్ని తెలంగాణ ప్రాంతం వాళ్లు అడ్డుకుంటున్నారనీ తెరపైకి సరికొత్త వాదన తీసుకువచ్చారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల్ని అడ్డుకునే వారి అంతుచూస్తామనే విధంగా మాట్లాడారు. మేలుకొలుపు కాస్త ఉసిగొలుపు మాదిరిగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాయలసీమ వెనకబాటు తనం, కరువు, ప్రజల కష్టనష్టాలు తెలిపేందుకు ఈ మేల్కొలుపు దీక్షను చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన బైరెడ్డి మాటలు మాత్రం అందుకు విరుద్దంగానే ఉన్నాయి. అటు రాయలసీమ నేతల్ని, ఇటు తెలంగాణ వారిని తన మాటలతో కడిగిపారేశారు. ఉతికి ఆరేశారు. రాయల తెలంగాణ అనే వారిని సీమ కుర్రకారు కుడికాలు చెప్పులతో తరిమి తరిమి కొడుతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ జోలికి వస్తే రాయలసీమ రుచి చూపెడుతామనీ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ఊడిగం చేయమనీ, సర్కార్ జిల్లాల ప్రజల మోకాళ్ల వద్ద బానిసలుగా ఉండబోమనీ, తామేమైనా కుక్కలమా? వారి వద్ద ఉండటానికి అని ప్రశ్నించిన తీరులోనే బైరెడ్డి అసలు నిజస్వరూపం బయటపడుతుందనీ పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ రాష్ర్టం ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే రాయలసీమ రుచి చూపెడుతామనీ, రాయల తెలంగాణ అనేవాళ్లను అడ్రస్ లేకుండా చేస్తామంటున్న తీరుతోనే బైరెడ్డి ప్రజల్ని మేల్కొల్పడం చేయడం లేదనీ, ఉసిగొల్పే విధంగా చేస్తున్నాడనీ అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఉంటే రాష్ర్టాన్ని ఒకటిగా ఉంచాలీ, లేదంటే సీమ, ఆంధ్ర, తెలంగాణ మూడు రాష్ర్టాలు చేయాలంటూనే సీమ కోసం తెలంగాణవాళ్లు అడ్డుపడుతున్నారనడంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? భయపెట్టాలనుకుంటున్నారా? మరేమైనా చెప్పాలనుకుంటున్నారో ఎవరకీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు కేంద్రం సీమను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేస్తామనీ ఏనాడు చెప్పలేదు. సీమ రాష్ర్టం ఏర్పడవద్దనీ ఏ తెలంగాణవాది అనలేదు. తెలంగాణ ఇచ్చుకున్న తరువాత ఎన్ని రాష్ర్టాలనైనా చేసుకోమనీ తెలంగాణవాదులే చెబుతున్నారు. కానీ, బైరెడ్డి మాత్రం వచ్చిన సీమను అడ్డుకుంటున్నట్లు మాట్లాడటం వెనక పక్కా రాజకీయమే కనిపిస్తోంది. తెలంగాణ వారిని తామేమీ ప్రాజెక్టులు రాసివ్వమనడం లేదనీ, తమ రాయలసీమ ప్రత్యేక రాష్ర్టాన్ని అడ్డుకోవద్దంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా ప్రస్తావనకు రానీ, రాయల తెలంగాణ అని అన్నా వ్యతిరేకించిన వారిని రెచ్చగొట్టే విధంగా బైరెడ్డి మాట్లాడటం సమంజసంగా లేదనీ తెలంగాణవాదులంటున్నారు.  ప్రస్తుతం అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మంచి వాతావరణం వుందనీ, బైరెడ్డి వ్యాఖ్యలతో ప్రశాంతత చెడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణవాదులు మలివిడత ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో బైరెడ్డి వ్యాఖ్యలు కొంత రెచ్చగొట్టే విధంగా ఉండటంతో మేల్కొలుపు కాస్త ఎప్పుడైనా ఉసిగొల్పుగా మారినా మారవచ్చు. ప్రజలారా బీ అలర్ట్.        

మరింత సమాచారం తెలుసుకోండి: