స్వఛ్చమైన ఈతకల్లు కల్తీ కావడం వెనుక పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న గల్తీ వ్యవహారమే ఉంది. మద్యం మాఫియాపై కొరడా ఝులిపించిన ప్రభుత్వం అంతకంటే పెద్దమొత్తంలో జరుగుతున్న అక్రమ కల్లు వ్యాపారంపై చేయకపోవడం ఇందుకు నిదర్శనం. గీచే వాడిదే కల్లు అన్నది మన శాశనం. కాని ఈకల్లు వ్యాపారం లో గీచేవారి మాట అటుంచితే కనీసం అందరు ఆకులానికి చెందిన వారుకూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల వ్యాపారం జరుగుతున్నప్పటికి కల్లుగీచే గీతకార్మికుని రాత మారలేదు. ఇప్పటికి వారి గ్రామాల్లో వారికి చెందిన ఈత చెట్ల కల్లునే స్వతంత్రంగా అమ్ముకోలేక, తానే తన చెట్లనుంచి కల్లుతీసే కూలిగా మారిపోయారు.ఇది బహిరంగ రహస్యమే అయినా దీనిని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.కారణం ఈవ్యాపారంలో అధికార,విపక్ష తేడా లేకుండా అన్నిపార్టీలకు చెందిన నాయకులు,ఎమ్మేల్యేలు,ఎంపీలు,మంత్రులు ఉన్నారు. సరే ఇదంతా పక్కన బెడితే రాష్ట్రంలో ఉన్న ఈతచెట్లెన్ని,వాటినుంచి ప్రతిరోజు వస్తున్న కల్లు ఎంత, అమ్ముడుపోతున్నదెంత అని ఎపుడైనా లెక్కించారా..? కల్తీకల్లు తాగి ఇప్పుడు మెదక్ జిల్లా కాళ్లకల్ లో వందకు పైగా అస్వస్థకు గురయ్యారు,కాని లెక్కకు మించి చనిపోయిన ఘటనలు ఎన్నోజరిగాయి.ఎవరైనా పట్టించుకున్నారా..? ఇప్పటికి గ్రామాల్లో ఏనిరుపేద ఇంట్లో శుభకార్యం జరిగినా,భాదాకర కార్యక్రమం జరిగినా ఈకల్లుతో దావత్ తప్పనిసరి. ఇలా వేడుకల్లో కల్తీకల్లు తాగి చనిపోయి విషాదఘటనలుగా మారిన సంధర్బాలు అనేకం ఉన్నాయి.చనిపోతున్నది నిరుపేదలే కదా అన్న చిన్నచూపేమో. కనుచూపు మేరలో ఎక్కడా ఈతచెట్లు లేక పోయినా సరే అక్కడ కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతినిస్తుంది ప్రభుత్వమే. చుక్కకల్లు బిందెడుగా మారుతోంది, ఇదికూడా రహస్యమేమి కాదు,బహిరంగమే. ఎలా అవుతోంది అన్నది కూడా అందరికి తెలిసిందే.ఈనిజాన్ని ఇప్పుడు జరిగిన మెదక్ జిల్లా ఘటన సంధర్బంగా ఎక్సయిజ్ అధికారులే షరామామూలుగా చెప్పేశారు.అదేంటంటే కల్లులో మోతాదుకు మించి క్లోరోహైడ్రేట్ కల్పడం వల్ల ఈప్రమాదం జరిగిందని చెప్పేశారు. అంటే ఇది కల్లులో కలిపి కల్తీ చేస్తున్నారన్నది తెలిసి జరుగుతున్న వ్యవహారమేనన్న మాట. ఇది నిషేదిత పదార్థమని అధికారులకు తెలియదా..? ఎందుకు తెలియదు మహారాష్ట్ర,కర్ణాటక ల నుంచి మన రాష్ట్రానికి అక్రమంగా ఇది రవాణా అవుతుండగా దాడులు చేసి పట్టుకున్న సంధర్బాలు ఎన్నో ఉన్నాయి. ఇదొక్కటే కాదు చక్కటి నురుగు,రుచి,కిక్కుకోసం డైజోఫాం,శాక్రిన్,కుక్కలను చంపడానికి ఉపయోగించే మందును కూడా క్లోరోహైడ్రేట్ తో పాటు కల్లులో కలిపి కల్తీచేస్తున్నారు. ఇది తాగడం అంటే అప్పటికప్పుడు చనిపోకపోయినా చావుకు దగ్గరగా స్పీడ్ గా వెలుతున్నట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈత చెట్లున్న గరీబ్ గీతకార్మికులను బినామీలుగా చేసి, వారిచెట్లను వారివద్దే ఏడాదికి కొంత చొప్పున చెల్లిస్తూ కొనుగోలు చేసి, వాటి నుంచి కల్లుతీసే నౌకరును కూడా వారికిచ్చి ఇంత యథేచ్చగా కల్తీకల్లు వ్యాపారం చేస్తున్నది పెద్దలే. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే కల్లుకాటుకు భారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది మాత్రం వాస్తవం.
మరింత సమాచారం తెలుసుకోండి: