హైదరాబాద్: నాలుగు జిల్లాల ప్రజల్ని, పోలీసులను గడగడలాడించిన సైకో సాంబ దొరికనట్టా? దొరకనట్టా? ఇది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారం రోజుల్లో సైకోను పట్టుకుంటామనీ నెల్లూరు పోలీసులు శపథం చేసి, 20రోజులు దాటుతోంది. అయితే, ఉన్మాది సాంబను పోలీసులు పట్టుకుని విచారిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు సాంబను పట్టుకున్నామనీ కానీ, పట్టుకోలేదనీ కానీ పోలీసులు చెప్పలేదు. దీనితో సాంబపై సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. అయితే,గత నెల రోజులుగా సాంబ ఆచూకీ కోసం నెల్లూరు, చిత్తూరు, క్రిష్ణ, గుంటూరు జిల్లాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న సాంబ ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియడం లేదు. నెల రో జులకు పైగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. క్రిష్ణ జిల్లాలో తప్పించుకున్న సాంబ ఖమ్మం జిల్లా అడవుల్లో దాక్కున్నారనే సమాచారంతో అక్కడ కూడా గాలిస్తున్నట్లు సమాచారం.  సాంబ ఆచూకీ కోసం అనువనువు గాలిస్తున్నారు. సాంబను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. పోలీసుల నుంచి సాంబ తప్పించుకుని పోవడంతో ప్రజల్లో పోలీస్ వ్యవస్థ అభాసుపాలైంది. దీనితో సాంబను పట్టుకుని తీరుతామనే ఉద్దేశంతో ప్రత్యేక పోలీసు టీంలు జల్లెడపడుతున్నాయి. అయినప్పటికీ సాంబ ఆచూకీని కనుగొనలేకపోతున్నారు. నాలుగు జిల్లాల ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉన్మాది సాంబశివరావును గత నెల కిందట పట్టుకున్న విషయం విధితమే. పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. సాంబను గొలుసులతో కట్టేసినప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకోవడం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంరేపింది. అంతే కాకుండా పోలీసుల నిర్లక్ష్యం మరోమారు బట్ట బయలైంది. ఎంతోమందిని హతమార్చిన ఉన్మాది సాంబ కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు గత కొన్ని నెలలుగా గాలిస్తున్నాయి. ఎట్టకేలకు దొరికిన సాంబ పోలీసుల కళ్లుగప్పి మళ్లీ పారిపోయారు. సాంబ చుట్టూ సీఐ, ఎస్ఐలు, సాయుధ కానిస్టేబుళ్లు ఉన్నారు. కాళ్లను గొలుసులతో కట్టినప్పటికీ వీటన్నింటి నుంచి తప్పించుకోవడం పూర్తిగా పోలీసుల వైఫల్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  చాలా నెలల తరువాత పట్టుబడ్డ సాంబను పోలీసులు విచారించగా క్రిష్ణ జిల్లా కొండపల్లి కొండపై బంగారం దాచిపెట్టినట్లు చెప్పడంతో ఓ సీఐ, ఎస్ఐ, 10మంది కానిస్టేబుళ్లు సాంబను కొండపల్లి కొండ వద్దకు తీసుకెళ్లారు. కొండపైకి తీసుకెళ్లిన సమయంలో గొలుసులతో కాళ్లను కట్టివేశారు కూడా. సాంబను గొలుసులతో పట్టుకున్నకానిస్టేబుళ్లను నెట్టివేసి సాంబ లోయలోకి దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ తప్పించుకున్న సాంబ నెల్లూరు జిల్లాలో బస్ లో నలుగురు ప్రయాణికుల గొంతుకోసి చేసి, మరో సవాల్ విసిరాడు ఇలా ఎంతోమందిని హత్యచేసి నాలుగు జిల్లాల ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పోలీసులకు కూడా సవాల్గా మారిన సాంబను నెల్లూరు పోలీసులు పట్టుకున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాంబను పోలీస్ ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో మాత్రం తెలియరావడం లేదు. ఒకవేళ పోలీసులకు దొరికితే ఉన్మాది సాంబ నుంచి ప్రజలకు, పోలీసులకూ కొంత రిలీఫ్ దొరికినట్టేననీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లేదంటే, సైకో సాంబ మరోమారు విరుచుకుపడటం ఖాయమనీ చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: