హైదరాబాద్: మొన్న నిలోఫర్...నిన్న కర్నూల్...నేడు వరంగల్. తిరుపతిలోని చిన్న పిల్లల దవాఖానలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి. ఏ ఆస్పత్రిలో చూసినా కనీస వైద్యం అందక పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. సర్కార్ దవాఖాన అంటేనే జనం భయపడుతున్నారు. హైదరాబాద్ లోని నీలోఫర్, వరంగల్ లోని మహాత్మగాంధీ ఆస్పత్రి, తిరుపతిలోని రుయా ఆస్పత్రులన్నీ ప్రభుత్వ ఆసుపత్రులే. ఇవన్నింటినీ పేదలు దేవాలయాలుగా భావిస్తారు.  కానీ, చికిత్స నిమిత్తం వచ్చే సరికి అవి స్మశానాలను తలపిస్తున్నాయి. ఈ దవాఖానల కోసం సర్కార్ కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నట్లు చెబుతోంది. కానీ, పేదోడికి మాత్రం వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది. కర్నూల్, హైదరాబాద్, తిరుపతి, వరంగల్ లోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇటీవలి కాలంలో వైద్యం అందక వందకు పైగా చిన్నారులు చనిపోయారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదు. కుంటిసాకులతో కాలాన్ని వెళ్లదీస్తున్నది. చిన్నారుల మరణంపై సాక్షాతు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించినప్పటికీ ఆసుపత్రుల్లో ఇప్పటికీ మెరుగైన వైద్యం అందడం లేదు. శిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిబ్బంది కొరత, వసతులలేమితో ఈ సర్కార్దవాఖానలన్నీకొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్న కొద్దిపాటి మంది వైద్యులన్నా చిన్నారులకు సేవలందిస్తున్నారా అంటే వారి సొంత క్లినిక్ ల మీద ఉన్న ప్రేమ ఈ సర్కార్ ఆసుపత్రుల మీద కనబర్చడం లేదు. పైన పేర్కొన్న ఆసుపత్రులన్నీ చిన్నారులకు ప్రత్యేకమైనవి. ఆర్థికంగా స్థోమత లేని పేదలందరూ ఈ సర్కార్ దవాఖానల్ని ఆశ్రయిస్తారు. ఒక్కో బెడ్ పై ఇద్దరుముగ్గురు పిల్లల్ని పడుకోబెడుతున్నారు. ఆక్సిజన్ కూడా అందించలేని దుర్భర స్థితిలో ఉన్న ఈ సర్కార్ ఆసుపత్రులన్నీ పసికందుల పాలిట మృత్యవుకూపాలుగా మారాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ పిల్లల్ని ఈ ఆసుపత్రుల్లో చేరిస్తే సజీవంగా ఇంటికి వస్తారనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగా మారడమే కాకుండా, ఎంతో మందికి కడుపుకోతను మిగిలిస్తున్నాయి. వసతులేమో, వైద్యుల నిర్లక్ష్యమో తెలియదు కానీ, మొత్తానికి వందలాది మంది చిన్నారుల ప్రాణాలు ప్రతినిత్యం గాలిలో కలుస్తున్నాయి. ఈ మరణాలకు అటు వైద్యులు, ఇటు సర్కార్ లెఖ్కలేనన్నీ కారణాలు చెబుతుందే తప్ప అసలు తప్పు ఎక్కడ వుంది, చికిత్స ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే దిశగా ఈ పాలకులు ఆలోచన చేయడం లేదు. చిన్నారులు చనిపోయినప్పుడు కాస్త హడావుడి చేస్తున్న పాలకలు తరువాత మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.  తిరుపతిలోని రుయాలో ఒక రోజు 13మంది చనిపోగా, వరంగల్ లోని ఎంజీఎంలో ముగ్గురు చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు కలిపించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేదోడి ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. వందలాది మంది చిన్నారులు చనిపోతున్నా కూడా పాలకులు కళ్లు తెరుచుకోకపోవడం సిగ్గుచేటుకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేద పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు సర్కార్ దవాఖానలో కనీస వసతులు కలిపించాలి. దాని కోసం సర్కార్ పని చేస్తుందనీ ఆశిద్ధాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: