హైదరాబాద్: రాష్ర్ట చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా కరంటు కోతలు చూడాల్సి వస్తోంది. ఎండా కాలంలో కరంటు కష్టాలు మామూలే. కానీ, వర్షకాలంలో కరంటు కోతలనేది వినడానికి కొంత ఆశ్చర్యమైనప్పటికీ వాస్తవం. గ్రామాల్లో 16గంటల పాటు కరంటు పోతుంది. పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోనూ 6నుంచి8గంటల వరకు కరంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. ట్రాన్స్ కో అధికారుల ముందుచూపు లేనితనం, పాలకల అలసత్వం కలిపి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కాస్త అంధకారప్రదేశ్ గా చేసిన ఘనత దక్కించుకున్నారు. కరంటు సరఫరా లేక వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఒకరు చనిపోయారు. అయినా, ఈ సర్కార్ మొద్దు నిద్రను వీడటం లేదు. ప్రజలతో చెలగాటమాడుకుంటోంది.  రైతులకు వ్యవసాయానికి 7గంటల పాటు నాణ్యమైన కరంటును సరఫరా చేస్తామన్న మాటలు ఆచరణలో అమలుకు నోచుకోలేదు. రెండుమూడు గంటల పాటు కరంటును సరఫరా చేస్తే రైతుకు అదే మహాభాగ్యమైంది. ఇక పరిశ్రమలు, గ్రుహాల సంగతి సరేసరి. కరంటును ఉత్పత్తి చేసే విద్యుత్ కేంద్రాలలో తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, వర్షాభావం కారణంగా ప్రాజెక్టుల్లోకి నీళ్లు చేరకపోవడంతో కావల్సినంతగా కరంటు ఉత్పత్తి కావడం లేదు. ప్రయివేట్ విద్యుత్ను ఉత్పత్తి చేసే యజమానులు మన రాష్ర్ట అవసరాలకు చేయాల్సినంతగా సరఫరా చేయడం లేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించే ముందు ప్రయివేట్ కంపెనీల వారు ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందుతారు. ఈ రాష్ర్ట అవసరాలకు సరిపడు కరంటును ఇచ్చాకనే మిగిలిన కరంటును ఇతర వారికి అమ్ముకుంటామంటూ సర్కార్ తో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా తొంగలోకి తొక్కారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  ప్రయివేట్ సంస్థల యజమానులతో సర్కార్ లోని కొంతమంది లాలూచీ పడిన కారణంగా మన రాష్ర్టానికి ఇవ్వాల్సిన కరంటును ఇవ్వడం లేదనీ, లేదంటే చేసుకున్న ఒప్పందంకంటే ఎక్కువ ధరకు మనకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాంకో, వేమగిరి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్యాస్ను సరఫరా చేస్తోంది. ఈ రెండూ ప్రయివేట్ సంస్థలే. వీటికి గ్యాస్ను నిలిపివేసి నేదునూరు, శంకర్ పల్లి గ్యాస్ ప్రాజెక్టులను నిర్మించి వాటికి కేటాయించాలనే డిమాండు రోజు రోజుకూ బలపడుతోంది. ఈ ప్రయివేట్ కంపెనీలకు అధికంగా రేటును చెల్లించడం వల్ల రాష్ర్ట ఖజానకు ఎంతలేదన్న 4వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందనీ, రాసుకున్న ఒప్పందం ప్రకారం మన రాష్ర్టానికి ప్రయివేట్ కంపెనీలవారు కరంటును ఇస్తే రాష్ర్టంలో ఇంతగా కరంటు సమస్య ఏర్పడి ఉండేది కాదనీ, విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. మొత్తానికి కరంటు కోతల వల్ల అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కరంటును సరఫరా చేయాలంటూ రాష్ర్ట వ్యాప్తంగా రైతులు ఆయా సబ్ స్టేషన్ల ముట్టడికి దిగుతున్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం స్పందించి కరంటు సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటుందనీ ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: