హైదరాబాద్: రాష్ర్టంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలంతా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. రాత్రి పడుకుంటే చనిపోతారంటూ పుకార్లు షికార్లు చేశాయి. పడుకుంటే చనిపోతున్నారంటూ వదంతులు వ్యాపించడంతో రాష్ర్టంలోని నిజామాబాద్, మెదక్, మహబూబనగర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పుకార్లు దావనంలా వ్యాపించడంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి చేరారు. ఒక జిల్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయనీ ప్రచారం జరిగితే, మరో జిల్లాలో భూకంపం వస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి.
దీనితో ఒక జిల్లా నుంచి మరో జిల్లాలో ఉంటున్న తమ బంధువులకు, మిత్రులకు, శ్రేయేభిలాషులకు రాత్రంతా ఫోన్లు వెళ్లాయి. ఇక ఏముంది ప్రజలంతా రాత్రి మొదలుకుని తెల్లవారుజాము వరకు ప్రజలంతా ప్రాణాల్ని అరచేతిలోపెట్టుకుని క్షణమొక యుగంగా వెళ్లదీశారు. పడుకుంటే చిన్న పిల్లలు చనిపోతారంటూ కూడా వదంతులు వ్యాపించడంతో చిన్నారులను చంకన వేసుకుని పిల్లలతో సహా, పెద్దలంతా రాత్రంతా జాగారం చేశారు. పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారేమో కానీ, ప్రజలు వాటిని నమ్మి మోసపోతున్నారు. ఈ పుకార్లను నమ్మకుండా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత సర్కార్ పైన వుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: