హైదరాబాద్: రాష్ర్టంలో రావణకాష్టం ఆగాలంలే కేంద్రం తెలంగాణ రాష్ర్టం ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేదనీ సీపీఐ అభిప్రాయడుతోంది. ప్రజల్ని చైతన్యపర్చి, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల్ని ఎండగట్టడానికి ఈ రోజు నుంచి 10రోజుల పాటు సీపీఐ తెలంగాణ జిల్లాలలో ప్రజాపోరుయాత్ర పేరిట తెలంగాణ పోరాటంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. కేంద్రంలో, రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తేల్చకుండా ఏకాభిప్రాయం పేరుతో ప్రతిపక్షాలపై నెపం నెట్టడం పచ్చి రాజకీయం అని సీపీఐ అంటోంది.
తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉందనీ, ఉద్యోగాలు, సాగునీటిలో అన్యాయంతో పాటు వైద్యకళాశాల్లో సీట్లు, డెల్టాకు నీటి విడుదల,పోలవరం వంటి ప్రాజెక్టు సమస్యలతో పాటు కేంద్రంతో నాన్చుడి ధోరణి అవలంభిస్తే మరిన్ని సమస్యలు వస్తాయనీ సీపీఐ పేర్కొంటోంది. ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెరగకుండా ఉండేదుకు సీపీఐ ఆ దిశగా కార్యచరణను రూపొందించుకుంది. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్...తెస్తామన్న టీఆర్ఎస్ తెలంగాణ విషయంలో కొంత మోసాన్ని చేశాయి.
ఈ తరుణంలో సీపీఐ తెలంగాణ ఉద్యమంలో ఇక చురుకైనా పాత్రను పోషించనున్నది. ప్రజల్లో చైతన్యం కలిగించి, తెలంగాణ పోరాటంలో నూతన అధ్యాయానికి శనివారం నాటి నుంచి వచ్చే నెల 3వరకు 10రోజుల పాటు సీపీఐ ప్రజా పోరుయాత్రను ప్రారంభిస్తోంది. సీపీఐ తలపెట్టిన ప్రజాపోరుయాత్రలో తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పాలుపంచుకుంటోంది. తెలంగాణ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకెళ్లడానికి గానూ సీపీఐ తలపెట్టిన పోరుయాత్రను ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ కార్యదర్శి నారాయణ ప్రారంభిస్తారు.
10రోజుల పాటు జరిగే సీపీఐ పోరుయాత్ర తెలంగాణలోని 10జిల్లాల్లో కొనసాగుతుంది. సెప్టెంబర్ 3న వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరుయాత్ర ముగియనున్నది. ప్రతి జిల్లాలో పర్యటించే సీపీఐ తెలంగాణపై ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను ప్రజలకు వివరించడంతో పాటు, తెలంగాణ గురించి సీపీఐ కట్టుబడి ఉన్న విషయాన్ని గుర్తు చేయనున్నది. తెలంగాణ కోసం సీపీఐ రాజీలేని పోరాటాన్ని చేస్తున్నట్లు ఈ పోరుయాత్ర ద్వారా ప్రజలకు చెప్పనున్నది.
మరింత సమాచారం తెలుసుకోండి: