హైదరాబాద్: వరుస హత్యలతో మెదక్ జిల్లా సిద్ధిపేట గజగజ వణికిపోతోంది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరిగాయి. ఈ వరుస హత్యలపై భిన్న స్వరాలు వినవస్తున్నాయి. గత కొంత కాలంగా కొంత ప్రశాంతంగా ఉన్న సిద్ధిపేట ప్రాంతంలో జరుగుతున్న హత్యలతో ప్రజలతో పాటు, హతుల కుటుంబ సభ్యుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్నవన్నీ హత్యలేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నా...పోలీసులు మాత్రం కొంత నిద్ర మత్తులోనే ఉన్నట్లు వరుస హత్యలు తేటతేల్లం చేస్తున్నాయి. గత రెండ్రోజుల కిందట సిద్ధిపేటలోని మైత్రివనంలో రావురూకలకు చెందిన హన్మంతరెడ్డి అనే వ్యక్తిని హత్య చేశారు. తాజాగా చిన్నకోడూరు మండలంలోని మెట్ పల్లికి చెందిన మాజీ మిలిటెంటు నారాయణరెడ్డిని కూడా ఈ రోజు తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. మూడు రోజుల్లో వరుసగా జరిగిన రెండు హత్యలు ఒకే విధంగా ఉన్నట్లు ఇక్కడికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సిద్ధిపేటలో జరుగుతున్న వరుస హత్యలన్నీ ఒకే ముఠా పాల్పడి వుండవచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా, మాజీ నక్సలైట్ నహీం ముఠాకు చెందిన వారిగా కొందరు మాజీ మిలిటెంట్లు ముఠాగా ఏర్పడి సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో సెటిల్ మెంట్లు చేస్తున్నారు. ప్రతి పంచాయితీలోనూ నహీం ముఠాగా చలామణి అవుతున్న కొంత మంది సభ్యులు ఇన్వాల్ అవుతున్నట్లు తెలుస్తోంది. తమకు అడ్డువచ్చిన వారిని ముందుగా తన వద్ద ఉన్న రివాల్వర్లతో బెదిరిస్తుంటారనీ...వినకుంటే తలలు తీసేయ్యడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, వీరు నహీం ముఠాగా చెందిన వారా? లేక నహీం ముఠాగా చలామణి అవుతున్నారా? అనేది పోలీసులు విచారించాల్సి వుంది. నిష్పక్షపాతంగా పోలీసులు విచారణను చేపడితే అనేక వాస్తవాలు వెలుగులోకి రావడమే కాకుండా, మరికొన్ని హత్యలు జరగకుండా ఆపేయ్యొచ్చనీ ప్రజలతో పాటు, సదరు ముఠా చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో విలువైన మనిషి ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపైన వుంది. ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా విచారణను చేపడతారనీ ఆశిద్ధాం. ఇదిలా ఉంటే, ఈ రోజు జరిగిన మాజీ మిలిటెంటు నారాయణరెడ్డి హత్యకేసులో ఓ మాజీ మిలిటెంటు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: