హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహార శైలి మారినట్లు అగుపిస్తోంది. గతంలో తెలం‘గానం’ విషయంలో కొంత అంటీముట్టనట్లుగా వ్యవహారించే వారు. కానీ, తెలంగాణ మార్చ్ నేపథ్యంలోఉప ముఖ్యమంత్రిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. తరుచూ తెలంగాణ మంత్రులు, ఎంపీలతో మాట్లాడుతుండటం...మార్చ్ కు అనుమతిచ్చాక ఎలా ఆంక్షలు పెడతారంటూ డీజీపీతో మాట్లాడటం...తెలంగాణ కోసం అవసరమైతే పదవులు వదులుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించడం చూస్తుంటే...గత ఉప ముఖ్యమంత్రికి, ఇప్పటి ఉప ముఖ్యమంత్రిలో ఎంతో తేడా వచ్చింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ తెలంగాణ మంత్రులను, ఎంపీలను, సీనియర్ నేతలకు తన ఇంటికి లంచ్ కు ఆహ్వానించారు. మంత్రులు బసవరాజు సారయ్య, ప్రసాద్ కుమార్, జానారెడ్డి, ఎంపీలు వివేక్, ప్రభాకర్, జగన్నాథం, సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ కేశవరావు తదితరులు హాజరయ్యారనీ తెలుస్తోంది.  ఈ సందర్భంగా వీరి మధ్యన నిన్న జరిగిన తెలంగాణ మార్చ్ తో పాటు భవిష్యత్ లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. టీజేఏసీ నేతలందరూ రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడం మానుకుని, ఇక మీదట టీజేఏసీ మంత్రులపై ఒత్తిళ్లు తెచ్చే విధంగా త్వరలోనే కార్యచరణను ప్రకటిస్తామనీ చెప్పిన విషయం విధితమే. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎలా ఒప్పించాలి. దానికి సంబంధించి ఎవరెవరూ ఢిల్లీకి వెళ్లాలి. అక్కడ ఎవరెవర్ని కలువాలి. తదితర అంశాల గురించి వారందరూ మాట్లాడుకుని ఉండొచ్చనీ తెలుస్తోంది. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జరుగుతన్న తెలంగాణ పోరాటంలో ఉప ముఖ్యమంత్రి దామోదరం పోషిస్తున్న పాత్ర అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ప్రజల నుంచి వస్తోన్న ఒత్తిళ్లో, లేక ముఖ్యమంత్రి కిరణ్ను ప్రజల్లో దోషిగా నిలబెట్టి తద్వారా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మెప్పు పొందాలనో తెలియదు కానీ, మొత్తానికి తెలంగాణ విషయంలో దామోదర రాజనర్సింహ చురుకైన పాత్రను పోషిస్తున్న తీరు అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: