సూరజ్ కుండ్ లో తెలంగాణ విషయంపై చర్చజరుగుతుందని టి.కాంగ్రెస్ ఎంపీలు ఆశించగా తెలంగాణ విషయం చర్చకు రాలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మరోసారి నిరాశకు గురయ్యారు. 70మంది సీనియర్లతో జరుగాల్సిన సమావేశానికి 66మంది హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చినప్పటికిని కేవలం తెలంగాణ విషయమే చర్చకు రాలేదు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకుండా తెలంగాణ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నటువంటి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కాంగ్రెస్ మోసం చేసిందని తెలుసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని టిఆర్ఎస్ మేధోమథనంలో తీర్మాణించారు. ఇటువంటి సమయంలో తెలంగాణపై సూరజ్ కుండ్ లో జరిగే సమావేశంలో అదిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని టి. కాంగ్రెస్ ఎంపీలు ఎదురు చూడగా అటువంటిది ఏది జరుగలేదు. కాగా తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనని అంటున్నటువంటి తెలంగాణ ఎంపీల భరోసా రోజరోజుకు నీరుగారి పోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలనుండి కాంగ్రెస్ పార్టీపై వత్తిడి పెరిగే అవకాశముంది. ఇటువంటి పరిస్థితిలో తమకు గడ్డుపరిస్థితులు ఏర్పడవచ్చుననే ముందు చూపుతో టి.కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ విషయంలో అధిష్టానాన్ని ఎదిరించడమా లేదా తెలంగాణ ఇచ్చే వరకు ఓపిక పట్టడమా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావచ్చుననే భయంతో ముందుగానే పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరడం కోసం కొంత మంది ఎంపీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొంత మంది ఏపార్టీలో చేరాలనే విషయంపై ఆలోచిస్తున్నారు. 2014లో జరుగనున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా తెలంగాణ విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుంటుందనే విషయాన్ని కూడా తెలంగాణ ఎంపీలు వాదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందా అనేది చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: