హైదరాబాద్: ఈ నెల 19న రాష్ర్టపతి ఎన్నికలు జరగనున్న విషయం విధితమే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పాల్గొంటుందా? లేక తటస్థంగా ఉంటుందా? అనే దానిపై నిన్నటి వరకు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి రాష్ర్టపతి ఎన్నికలపై జరుగుతున్న సస్పెన్స్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే తెరదించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ పాల్గొనకుండా టి-జేఏసీ, తెలంగాణావాదులు ఒత్తిళ్లు తెస్తున్నారు. నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవల్సి వుంది. పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే అక్రమ ఆస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉంటున్న జగన్‌కు రాష్ర్ట హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెల్సిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థలకు తాను అన్ని విధాలుగా సహకరిస్తున్నానీ, తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరితమైనవనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా ఈ నెలలో రాష్ర్టపతి ఎన్నికలు జరగనున్నాయనీ, తాను ఎంపీగా రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు వుందనీ, ఆ హక్కును ఉపయోగించుకోవడం కోసమైనా తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా బెయిల్ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో ఇన్ని రోజులుగా రాష్ర్టపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ పాల్గొంటదా, లేదా అనే దానికి జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పాల్గొనబోతున్నట్లు స్పష్టంగా చెప్పారు. రాష్ర్టపతి ఎన్నికల్లో పాల్గొంటున్నామనే సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై మళ్లీ జోరుగా ప్రచారం మొదలైంది. రాజకీయ వర్గాల్లో రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యూపీఏ తరుపున కేంద్ర మాజీమంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీఏ తరుపున పీఏ సంగ్మా రాష్ర్టపతి అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ర్టపతి అభ్యర్థులుగా పోటీ పడుతున్న ప్రణబ్, సంగ్మా ఇద్దరూ వైఎస్ఆర్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నించారు. సంగ్మా నేరుగా విజయమ్మను కలిసి మద్దతు కోరగా, ప్రణబ్ తరుపున ఎంఐఎం అధినేత అసదుద్దీన్ జైలులో ఉనన జగన్‌ను కలిసారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా స్వయంగా ప్రణబే విజయమ్మకు ఫోన్ చేసి మద్దతు కోరారు. అయితే, ఇప్పటి వరకు ఆపార్టీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రణబ్, సంగ్మా ఇద్దరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉంటారనే ప్రచారం జరిగింది.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ బలపర్చిన ప్రణబ్‌కు ఓటు వేయడం వల్ల ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్లవుతుందనీ, ఇక సంగ్మా విషయానికి వస్త్ మతతత్వ పార్టీ అయిన బీజేపీ దించిన అభ్యర్థికి కూడా ఓటు వేయడం అంత మంచిది కాదనుకున్నారు. ఎవరికీ వేయకుండా ఎన్నికలకు దూరంగా ఉండటంపై పార్టీలో కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడైన జగనే రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటేసే హక్కును వినియోగించుకోవడం కోసం బెయిల్ మంజూరు చేయాల్సిందిగా దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.
బెయిల్ పిటిషన్లో ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా పేర్కొనడంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న ఓ సస్పెన్స్‌కు తెరిదించినట్లయ్యింది. రాష్ర్టపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ పాల్గొంటుదనేది తేలిపోయింది. అయితే, ఇప్పుడు ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారనే మరో అంశానికి సంబంధించి ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలపవచ్చనే ప్రచారమూ లేకపోలేదు. మరి జగన్ ఎలా వ్యవహారిస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వైఎస్ఆర్ పార్టీకి 17మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పార్లమెంటు సభ్యులున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: