
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు ఒకసారి ముదిగేడులో ఉన్నప్పుడు లింగాల రమణా రెడ్డి వచ్చి కలిశారు. తన తల్లి బ్లడ్ కాన్సర్ తో భాదపడుతుంది.. ఒకసారి వచ్చి చూడమని ప్రార్ధించాడు. ఆమెను మద్రాసు తీసుకుపోవాలనుకున్నాం.. ఆమె మా మాట వినడం లేదు.. మీరు వచ్చి చూసి తగిన వైద్యం చేయండి అని స్వామివారిని వేడుకున్నాడు. మీరు పదండి ఇప్పుడు నేను రావడానికి కుదరదు తర్వాత వస్తాను అని చెప్పారు. రాత్రికి పొద్దుపోయాక వెళ్ళి ఆమెను చూశారు. అయ్యా ఈమెను ఆరుగురు వైద్యులు పరిశీలిస్తున్నారు. ఒకరు ఇంజెక్షన్ ఇచ్చారు.. మరో మూడు రోజుల్లో ఈమెకోసం ఆ లోకం వాళ్ళు వస్తున్నారు.. మీరు చేసేదేమీలేదు.. అంతా వాళ్ళు చూస్తారు అన్నారు.
కర్మానుసారమే ఆయుర్ధాయం
వాళ్ళు ఆశ్చర్య పోయారు.. అప్పటికే ఆరుగురు వైద్యులు ఆమెను చూసిన మాట వాస్తవమే. ఇంజెక్షన్ ఇచ్చిన మాట కూడా వాస్తవం. స్వామి ఆ లోకం వాళ్ళు వస్తారంటున్నారు.. అది అర్థం కాలేదన్నారు. బహుశా వేరే ఎవరన్నా కొత్త వైద్యులు వచ్చి చూసి మందులు ఇస్తారేమో అనుకున్నారు. మూడో రోజు ఆమె మరణించింది. ఏ వైద్యం చేసినా ఆమె బతకడానికి అవకాశం లేదు.. అందుకే వెంకయ్య స్వామివారు అలా చెప్పి మూడోరోజు ఆమెకు ముక్తిని ప్రసాదించారు. వెంకయ్యస్వామివారికి ఎవరి తలరాత ఏమిటో బాగా తెలుసు. వారి వారి కర్మానుసారంగా ఆయుర్దాయం నిర్ణయం జరుగుతుంది. అదే సూత్రం ప్రకారం స్వామి మూడు రోజులు మాత్రమే ఆమె జీవిస్తుంది అని చెప్పారు. ఆ విషయం వీళ్లకి అర్థం కాలేదు. స్వామివారు చివరిరోజుల్లో ఆమెకు తన దర్శనమిచ్చి ముక్తి ప్రసాదించారు. యోగులు, సద్గురువులు తమ భక్తుల కోసం ఎంతదూరమైనా వస్తారు.. ఎంత దూరమైనా ప్రయాణిస్తారు.. వారి కష్టాలనే తమ కష్టాలుగా భావిస్తారు. వారికి జన్మ పరంపరలుంటాయా? ముక్తి లభిస్తుందా? అనేది భగవంతుడి నిర్ణయమైనా.. తనను నమ్ముకున్న భక్తుడి కోసం సద్గురువులు అవసరమైతే వారికి ముక్తిని ప్రసాదించి మళ్లీ జన్మలేకుండా చేయగలరు. అంతటి మహత్యం వారిది.