పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఇప్పటికే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్లకు మరో షాకింగ్ న్యూస్ అందబోతోంది. బంగారం ధర ఏకంగా 40 వేల మార్క్‌కు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదికూడా ఈ దీపావళికి ఈ స్థాయికి పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు భారత్‌లోనూ బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. దీంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.  


బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేనంతగా దీని ధర ఎగబాకుతోంది. వచ్చే 4 నెలల పాటు పసిడి ధరలు పెరిగే అవకాశమే ఎక్కువ అని బంగారం వర్తకులు, నిపుణులు చెబుతున్న మాటలు వినియోగదారుల్లో మరింత ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పది గ్రాముల పసిడి 40వేలకు చేరువగా వెళ్తోంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గకపోవడంతో పసిడి ధర అంతకంతకూ పెరుగుతోందని చెబుతున్నాయి బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా.. దేశీయంగా బంగారం ధర పెరుగుతోంది. ముఖ్యంగా వ్యాపారులు, ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంది. రూపాయి బలహీన పడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతోంది. ఇప్పుడు బంగారం ప్రియులకు మరో షాకింగ్ న్యూస్ అందబోతోంది. గోల్డ్‌ ధర ఏకంగా 40 వేల మార్క్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అది కూడా ఈ దీపావళికి ఈ స్థాయికి పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 


మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో ప్రస్తుతం బంగారం అక్టోబర్ కాంట్రాక్ట్ విలువ పది గ్రాములకు 37 వేల 995 రూపాయలుగా ఉంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే బంగారం డిమాండ్ కూడా దిగిరావొచ్చు. అయితే.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం దీపావళి కల్లా బంగారం ధర 39 వేల నుంచి 40 వేల మార్క్‌కు చేరొచ్చంటున్నారు. ప్రపంచ వృద్ధి రేటు తగ్గడమనే ప్రధాన కారణం వల్ల పసిడి ధర పెరుగుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయండంటూ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడులు పెడితే ఇన్సూరెన్స్ చేసినట్టేనని సలహా ఇస్తున్నారు. బంగారం మార్కెట్‌లో బేర్ రన్ ముగిసిందని, ఇప్పుడు బుల్ రన్ మొదలైందంటున్నారు. 


కేంద్ర బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లు, అమెరికా-చైనా మధ్య ఇప్పుడు నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధర పెరుగుదలకు మద్దతునిస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా యూరప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ కూడా రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేసింది. దీంతో ఆర్థిక మాంద్యం దగ్గరిలోనే ఉందనే ఆందోళనలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ భయాల కారణంగా యూకేలో కూడా వృద్ధి రేటు పడిపోయింది. ఇప్పుడు చైనా కూడా ఆర్థిక మాంద్య ఆందోళనలకు ఆజ్యం పోస్తోంది. చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి గణంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 


అమెరికాతో చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగితే వచ్చే మూడు త్రైమాసికాల్లో గ్లోబల్ ఎకానమీ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ఇకపోతే స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దిగివచ్చే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, దీంతో పసిడి ధర ఎక్కువగా పెరిగిందని తెలిపారు. మన రిజర్వు బ్యాంక్  కూడా బంగారం కొంటూనే ఉంది. వచ్చేది పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కాబట్టి అమ్మకాలు మరింత పెరుగుతాయని జ్యూవెలరీ వ్యాపారులు ఆశిస్తున్నారు. అక్టోబరు-నవంబరు నాటికి ధర ఇప్పటికంటే ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ధర పెరుగుతుందనే ఆలోచనతో పాత బంగారం అమ్మేవాళ్లు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: