విశాఖ విమానాశ్రయానికి నేవీ గ్రహణం పట్టింది. విమానయాన సంస్థలు రెడీగా ఉన్నా స్లాట్స్‌ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు అంతర్జాతీయ డొమెస్టిక్‌ ఫ్లైట్లు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు పెరుగుతున్నా, విమానాలు తగ్గటంతో విశాఖ ఎయిర్‌ ట్రావెలర్స్‌ నానా ఇబ్బందులు పడుతున్నారు. 


విశాఖకు విమానయాన సంస్థలు గుడ్ బై కొట్టేస్తున్నాయ్. వరుసగా సర్వీసులు రద్దైపోతున్నాయ్. లేటెస్ట్‌ గా బ్యాంకాక్ విమానం కూడా ఆగింది. స్లాట్స్ కేటాయింపుల్లో నేవీ ఆంక్షలు పెరగటం, రన్ వే విస్తరణ పూర్తికాకపోవడంతో విశాఖలో విమానాశ్రయం ఉండీ ప్రయోజనంలేకుండా మారుతోంది. నిత్యం ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నా, ఆ స్థాయిలో విమానాలు లేకపోవడంతో  విశాఖ ఎయిర్ పోర్ట్ ఇబ్బందుల్లో పడుతోంది. విశాఖ ఎయిర్ ట్రావెలర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో మెట్రో కల్చర్ అందుకోటానికి, విశ్వనగరంగా అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు ఉన్ననగరం విశాఖపట్నం. అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ తో పాటు పోర్ట్ కూడా ఉన్న విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందాల్సిన సమయంలో అనూహ్యమైన ఇక్కట్లలో పడుతోంది. 


ప్రపంచమంతా ఎయిర్ కనెక్టివిటీ పెరిగే దిశగా పయనిస్తోంది. చిన్న నగరాలు పట్టణాలకు కూడా విమానాలు ఎగురుతున్నాయి. కానీ, విశాఖకు మాత్రం ఉన్న ఫ్లైట్ లు రద్దవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖనుంచి పౌరవిమానయాన సర్వీసులు నిర్వహిస్తున్నా.... గగనతలం మొత్తం డిఫెన్స్ పరిధిలో వుండటంతో ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం  ఇండియన్ నేవీ చేతిలోనే ఉంటుంది. రక్షణ స్థావరం ఐ.ఎన్.ఎస్.డేగా నుంచి నేవీ యుద్ధవిమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో విశాఖ నగరానికి సర్వీసులు నడిపేందుకు ఎయిర్ లైన్  సంస్థలు ముందుకొస్తే సరిపోదు.. వాటికి డిఫెన్స్ క్లియరెన్స్ వస్తేనే మోక్షం కలుగుతుంది. ఆయా విమానయాన సర్వీసులకు నేవీ స్లాట్స్ ఇస్తేనే విమానాలు రివ్వున ఎగిరే అవకాశం ఉంటుంది.


నిజానికి కొన్నేళ్లుగా విశాఖకు అంతర్జాతీయ సర్వీసులు పెరుగుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో నేవీ కార్యకలాపాలు పెరగడంతో...డొమెస్టిక్ సర్వీసుల స్లాట్స్ కు కోతపెట్టింది. విమానయాన సంస్థలు అడుగుతున్న సమయంలో రాకపోకలను అనుమతించడం లేదు. సాయంత్రం 6నుంచి 10గంటల మధ్య డిఫెన్స్ విమానాలకు 50స్లాట్లు నేవీ విమానాలకు కేటాయించి, పౌరవిమానాలకుకేవలం 10స్లాట్లు మాత్రమే ఇచ్చింది. పైగా కొత్త విమానాలకు ఆ సమయంలో అవకాశం లేదని కూడా  ప్రకటించింది. ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంతో సర్వీసులు  నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా విమానాలకు మరమ్మత్తుల దెబ్బ తగిలింది. 23కోట్ల రూపాయల వయాబులిటీ గ్యాప్ ఫండ్ బకాయిలతో అలయెన్స్ ఎయిర్ విజయవాడ, తిరుపతి విమానాలు రద్దైపోయాయి. ఈ సర్వీస్ పునరుద్ధరించేందుకు తిరిగి అలయెన్స్ ఎయిర్ ముందుకు వచ్చినా....స్లాట్స్ సమస్యగా మారింది. ఇక, అంతర్జాతీయ విమానసర్వీసులు ఒక్కొక్కటిగా విశాఖకు దూరమవుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక ఎయిర్ వేస్ విశాఖ-కొలంబో సర్వీసులు ఆపేసింది. ఇప్పుడు అర్ధరాత్రి విశాఖ నుంచి బ్యాంకాక్ వెళ్ళే ఎయిర్ ఏషియా వచ్చేనెల 27నుంచి టిక్కెట్ల విక్రయాలను ఆపేసిందని ట్రావెల్స్ వర్గాలు చెప్తున్నాయి. నేవీ ఆంక్షలు ఒక ఎత్తైతే....ఒక మార్గంలోనే రన్ వే నిర్వహించాల్సి రావడం ఇబ్బందిగా మారిందని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్లు భావిస్తున్నాయి.


విశాఖలో విమానాలు ల్యాండింగ్ అవ్వాలంటే....ముందు సముద్రం మీదకు వెళ్ళి అక్కడి నుంచి నిర్ధేశించిన మార్గంలో ల్యాండ్ అవ్వాలి. ఇందుకు కనీసం 10నిముషాల సమయం అధికంగా పడుతుంటే, ఆమేరకు ఇంధన వినియోగం పెరుగుతోంది. నిజానికి విశాఖకు వచ్చే ప్రయాణీకుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నుంచి జూలై వరకూ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్యలో 2% వృద్ధి నమోదైంది. డొమెస్టిక్ కార్గో 9% పెరిగింది. కానీ విమానాల రాకపోకలకు ఇబ్బందులు రావటంతోపాటు, పలు విమాన సంస్థలకున్న ఇబ్బందుల కారణంగా వాటి రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నేవీ తో సంప్రదింపులు జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. విశాఖ ఎయిర్ కనెక్టివిటీ సమస్య పరిష్కారానికి భోగాపురం ఇంటర్నేషనల్ పోర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అంతవరకు విశాఖ ఎయిర్ పోర్టులోనే తాత్కాలికంగా మరో రన్ వేను నిర్మించాలని ఎయిర్ ట్రావెలర్స్ డిమాండ్ చేస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: