ఫలానా బ్యాంక్‌ను మూసేస్తారు..! పంజాబ్‌-మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌కు పట్టిన గతే ఈ బ్యాంక్‌కు పడుతుంది. ఇదీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పలు బ్యాంక్ లపై జరుగుతున్న ప్రచారం. అయితే... దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. అవన్నీ వట్టి పుకార్లుగా కొట్టిపారేసింది. పుకార్లను నమ్మవద్దు... ఏ బ్యాంక్‌ అయినా మూసివేస్తామనే ప్రశ్నే అక్కరలేదు. కమర్షియల్‌ బ్యాంక్ లేవీ మూతపడడం లేదు. ఇదీ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన సమాధానం. 


ఇటీవల పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తూ ఆర్.బి.ఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల వరకూ అప్పులు ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్  డిపాజిట్‌దారుల్ని కూడా కష్టాల్లోకి నెట్టింది ఆర్.బి.ఐ. వెయ్యి రూపాయలు మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేదన్న ఆదేశాలతో అయోమయంలో పడ్డారు కస్టమర్లు. తమ డబ్బులు డ్రా చేసుకోడానికి పి.ఎమ్.సి బ్యాంక్‌ బ్రాంచీలకు పోటెత్తుతున్నారు.   


పి.ఎమ్.సి బ్యాంక్‌ విషయంలో ఆర్.బి.ఐ తీసుకున్న నిర్ణయం కాస్త... దేశంలో పలు బ్యాంకుల్ని మూసివేయబోతున్నారనే  పుకార్లకు ఊతమిచ్చింది. కొన్ని కమర్షియల్‌ బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దేశంలోనే అతి పెద్ద కమర్షియల్‌ బ్యాంక్ లు ఈ జాబితాలో ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గ్రహించిన ఆర్బీఐ అధికారులు... సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.   


కొన్ని కమర్షియల్‌ బ్యాంక్ లు మూతపడతాయన్న ప్రచారంలో నిజం లేదనీ... సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆర్.బి.ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. పి.ఎమ్.సి బ్యాంకుకు తక్షణమే వచ్చిన ముప్పేమీ లేదని తెలిపింది. అయితే వ్యాపార లావాదేవీలు జరపొద్దని పి.ఎమ్.సి బ్యాంక్‌ను ఎందుకు ఆదేశించిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆర్.బి.ఐ. తమ బ్యాంక్‌లో మొండి బాకీలకు సంబంధించి ఆర్.బి.ఐ రికార్డుల్ని తనిఖీ చేస్తోందని అంటున్నారు పి.ఎమ్.సి బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ థామస్‌. డిపాజిట్ లు తిరిగి చెల్లించేందుకు తమ బ్యాంక్‌లో తగిన నగదు నిల్వలున్నాయని ఆయన చెప్పారు.  ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అక్కరలేదని కూడా స్పష్టం చేశారు థామస్‌.   

 

అంతా బాగుంటే వ్యాపార లావాదేవీలు జరపకుండా పి.ఎమ్.సి బ్యాంక్‌పై ఆర్.బి.ఐ ఎందుకు నిషేధాజ్ఞలు విధించిందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. మరోవైపు పి.ఎమ్.సి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసిన తమ డబ్బులు సంగతేమిటని ప్రశ్నిస్తున్న కస్టమర్లకు సరైన సమాధానమే దొరకడం లేదు. మొత్తానికి పి.ఎమ్.సి  బ్యాంక్‌ విషయంలో ఆర్.బి.ఐ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 








మరింత సమాచారం తెలుసుకోండి: