అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా వ్యాపారస్తులు తయారయ్యారు. అక్కడెక్కెడో ఏదో జరిగిందని చెప్పి, వైరస్ బూచిని చూపి మార్కెట్ ధరలను దింపేస్తున్నారు. రైతులను నట్టేట ముంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరుగుతున్న తంతు.

 

కరోనా సంచలనం ఇప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కూడా తాకింది. కరోనా వ్యవహారంతో ఎక్స్ పోర్టు ఏమన్నా తగ్గిందో లేదో కానీ.. ఆ పేరు మీద ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మాత్రం వ్యాపారస్తులు రింగ్ అయ్యారు. మంచి ధర పలుకుతున్న మిర్చికి అమాంతంర ధర తగ్గించేశారు. ఒక్కసారిగా మూడు వేల రూపాయలు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే చైనాలో కరోనా వ్యాధి వల్ల ఎగుమతులు నిలిచిపోయి ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 

 

గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చీ ధర పెరిగింది. అయితే, ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలబడనివ్వడం లేదు వ్యాపారస్తులు. నిన్నటి వరకు మిగిలిన మిర్చీని అధిక ధరలకు అమ్ముకున్న దళారులు, రైతులు మిర్చీ బస్తాలతో మార్కెట్‌కు వస్తుండడంతో ధరలను దించేస్తూ దోచుకుతింటున్నారు.

 

గతేడాది 12 వేలు ఉన్న మిర్చి ధర... ఈ ఏడాదిలో 22 వేల రూపాయలకు పెరిగింది. అయితే గత వారం రోజుల నుంచి ధరలు బాగా పతనమవుతున్నాయి. మొన్న 15వేల 500ఉన్న ధర..నిన్నటికి 11వేలకు పడిపోయింది. ఒక్క సారిగా దించేయడంతో, రైతులు రోడ్డెక్కారు.  మార్కెట్ యార్డుకు గేట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను ఘోరావ్ చేయడంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

 

కరోనాతో దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా...ఆ వ్యాధి వల్ల ఎక్స్ పోర్టులు మొత్తం ఆగిపోయినట్లుగా కలరింగ్ ఇస్తున్నారు వ్యాపారస్తులు. అయితే,  ధరలు తగ్గించి తమ పొట్టకొట్టొద్దని రైతులు వేడుకుంటున్నారు.  మార్కెట్ యార్డ్ అధికారులు మాత్రం దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై మిర్చి రైతుల్ని కరోనా బూచి చూపించి దోచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: