కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రజా రవాణా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. కుటుంబ సభ్యుల భద్రత నేపథ్యంలో సొంత వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. కొనుగోళ్లతోపాటు ధరలు సైతం అమాంతం పెరిగాయి.

ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కార్లను ఎక్కువగా వినియోగించేవారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం మధ్యతరగతి వారు కార్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త కార్లను కొనుగోలు చేసే స్తోమత లేనివారు వినియోగించిన వాహనాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ.70వేల నుంచి రూ.3లక్షల వరకు లభించే వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గతంలో రూ.70వేలకు లభించిన కార్లు కాస్త రూ.లక్షన్నరకు చేరుకున్నాయని కొనుగోలు దారులు అంటున్నారు. ‘‘కరోనా కారణంగా బస్సులు, ఆటోల్లో వెళ్లాలంటే భయంగా ఉంటోంది. అందుకని సొంతంగా వాహనం కొనుగోలు చేయాలని అనుకున్నాం. అయితే, కొత్త కారు కొనాలంటే భారీ ఎత్తున ఖర్చవుతోంది. ఆ పరిస్థితి లేదు కాబట్టి సెకెండ్‌ హ్యాండ్ కారు దొరుకుతుందేమో అని వచ్చాం. ఇక్కడ చాలా వరకు వినియోగించిన కార్లు దొరుకుతున్నాయి’’ అని కొనుగోలు దారులు చెబుతున్నారు.

దీనికి తోడు ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేనందున వినియోగదారులు పెట్రోల్‌ కార్లు ఎక్కువగా కొంటున్నారని విక్రయదారులు చెబుతున్నారు. కార్ల టైర్లు, అద్దాలను బట్టి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందో అంచనా వేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో నెలకు 7-8 పాత కార్లను విక్రయించగా.. ప్రస్తుతం మూడు-నాలుగింతలు విక్రయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. దీనికి తోడు ఫైనాన్స్‌ కంపెనీలు ఆర్థిక సాయం చేస్తుండటంతో  కలసి వస్తోందని అమ్మకపు దారులు అంటున్నారు.

‘‘ఈ ఆరు నెలల్లోనే కార్ల విక్రయాలు గతంలో లేనంత ఎక్కువగా పెరిగాయి. చాలా మంది సెకెండ్‌ హ్యాండ్‌ వాహనాల కోసం మా వర్క్‌షాప్‌కు వస్తున్నారు. రూ.1.50లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు సొమ్ము పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అందరూ బస్సు, ఆటో ఎక్కాలంటే జంకుతున్నారు. గతంలో నెలకు కేవలం 30 వాహనాలు మాత్రమే అమ్మేవాళ్లం. ఇప్పుడు ఆసంఖ్య 50కి పెరిగింది’’ అని విక్రయదారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: