ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్య నగరమైన, సుందర సాగర తీరం గల పట్టణం...  విశాఖపట్నంలో భారీ స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని సముద్ర తీర గ్రామం అయినటువంటి పూడిమడక దగ్గర సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత రాయితీలు ( పీఎల్‌ఐ ) స్కీం కింద కీలకమైన పది రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారుల బృందం ఢిల్లీలో వివిధ శాఖల అధికారులతో జరిపిన చర్చలు ఎట్టకేలకు విజయవంతం అయ్యాయి.




ఈ స్టీల్‌ క్లస్టర్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి వివరించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద పరిశ్రమల శాఖ ప్రతిపాదించిన ఈ స్టీల్ క్లస్టర్‌ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. అలాగే దీని ఫలితంగా వచ్చే ఐదేళ్లలో ఏపీ రాష్ట్రం నుంచి ఎగుమతులు రెట్టింపు అవుతాయని.. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చైన్, ఎగుమతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇక దీనితో పాటుగా అనంతపురం జిల్లాలో అపెరల్‌ పార్కు, నగరిలో టెక్స్‌టైల్‌ పార్కులతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్‌ వంటి మొత్తం పలు కీలకమైన పది రంగాల్లో థీమ్‌ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. అలాగే పారిశ్రామిక కారిడార్లలో భాగంగా అభివృద్ధి చేస్తున్న వివిధ నోడ్‌ల వివరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: