ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చాలని.. ఇక ఆఫీసులకు వచ్చి పని చేయాలని పిలుపునిచ్చింది. కనీసం ౩౦ నుంచి 50 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసేలా ఐటీ కంపెనీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఐటీ కంపెనీలు.. తమ ఉద్యోగులతో ఏడాదికి పైగానే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి వర్క్‌ చేయడం చాలా మందికి తొలుత బాగానే ఉండింది. అయితే తర్వాత ఆఫీసులో కంటే ఇంటి నుంచే ఎక్కువగా పని చేయిస్తున్నారన్న ఫీలింగ్‌ వారిలో నెలకొంది. ఆఫీసులో 8 గంటలు  డ్యూటీ చేస్తే.. ఇంట్లో మాత్రం రోజుకు పది నుంచి 12 గంటలపాటు చేయిస్తున్నారన్న ఆవేదనలో వారు ఉన్నారు. ఇంట్లో కంటే ఆఫీసుకు వెళ్లి పనిచేయడమే మేలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు.. తమ ఉద్యోగులతో కార్యాలయాల్లోనే పని చేయించాలని నిర్ణయించాయి. దీంతో ఐటీ ఉద్యోగులు.. తమకు ఊరట లభించిందని హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. తమ ఐటీ కంపెనీల ఆఫీసులు ఎప్పుడు ఓపెన్‌ చేస్తే చాలు వెళ్దాం అన్నట్లుగా ఉద్యోగులు కూడా రెడీగా ఉన్నారు.

నిజానికి కరోనా నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతోంది. కరోనా టీకాను ఇవ్వడంలో దేశంలోని మెజారిటీ జనాభాను కవర్‌ చేశారు. అంతేకాకుండా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత కూడా చాలా వరకు తగ్గింది. కొత్త కేసుల నమోదు సంఖ్య కూడా రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ఈ పరిణామాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఐటీ కంపెనీలు.. ఇక తమ కార్యకలాపాలను ఆఫీసుల నుంచి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ముగింపు పలికించి.. ఆఫీసుల నుంచి వారితో పనిని షురూ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అయితే కరోనా కారణంగా ఐటీ కంపెనీల ఆఫీసులు క్లోజ్‌ కావడంతో.. ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే వర్క్‌ చేస్తున్నారు. వారిలో అందరినీ కాకున్నా.. కనీసం ౩౦ నుంచి 50 శాతం మందితో ఆఫీసుల నుంచి తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని ఐటీ కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఐటీ పరిశ్రమ ముఖ్యులతో చర్చలు జరిపింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న భరోసా ఇచ్చింది. ఇక ఐటీ పరిశ్రమపై ఆధారపడిన ఎంంతోమంది.. ఆ కంపెనీల కార్యాలయాల్లో పనులు తిరిగి ప్రారంభం అయితే.. తమకు కూడా ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నారు. మొత్తంమీద, ఐటీ కంపెనీల కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో కళకళలాడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: