దీపావళి పండుగ వచ్చేస్తుంది అనగానే గుర్తుకు వచ్చేది టపాసులే. కానీ దీపావళి అంటే చెడుపై మంచి మరోసారి గెలిచినందుకు చీకటిని పారద్రోలే వెలుగులోకి వచ్చినట్టుగా భావించి దీపాలను వెలిగిస్తారు. కానీ రానురాను ఇది కేవలం టపాసుల పండుగగా మారిపోయింది. ఎక్కడ దానికి ఈ జాడ్యం అంటిందో కానీ అప్పటి నుండి ఈ టపాసుల వాడకం విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పరిమితి మించి పారిశ్రామికీకరణ కారణంగా వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చేశాయి. మనిషికి ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛమైన గాలి, నీరు లను తనకు తానే కలుషితం చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మరో కాలుష్యంగా పరిణమించింది ఈ టపాసుల వాడకం.

పండుగ వస్తే ముందుగానే టపాసుల ను ఎవరికి కుదిరిన బడ్జెట్ లో వాళ్ళు కొనుగోలు చేసుకొని కాస్త ఎండకు ఆరపెడతారు. ఆ సమయంలో కాస్త వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ఈ ప్రకారం గా చేస్తుంటారు. టపాసుల లో కూడా రానురాను అనేక మార్పులు వచ్చేశాయి.  పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ పేలేవి తయారీ చేయడం బాగా అలవాటు అయ్యింది. అలాంటి వాటినే కొనుగోలు దారులు కూడా అడుగుతుండటంతో తయారీ దారులు కూడా అవే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. దీనితో కాలుష్యం రెండింతలు అయ్యింది, ఒకటి గాలి కాలుష్యం, రెండు శబ్దకాలుష్యం. అందుకే ఈమధ్య ఈ పండగ వస్తే గదిలోకి వెళ్లి చెవులు మూసుకొని ఉండాల్సి వస్తుంది. అంతగా శబ్దకాలుష్యం జరుగుతుంది.

అందుకే ప్రతి దీపావళికి ఎవరో ఒకరు టపాసుల విక్రయాలు, తయారీ పై పిటిషన్ వేస్తున్నారు. ఈసారి కూడా అదే జరిగింది. అందుకే కోర్టులు కూడా కొందరి ఉపాధి కోసమని మిగిలిన వారి అందరిని బాధించలేమని చెప్పింది. కేసు వాయిదా పడటంతో మరోసారి విచారణ జరుగుతుంది. ప్రతియేటా టపాసులు తయారీ చేసే చోట కనీస సౌకర్యాలు లోపంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ళ చావులను సెలెబ్రేట్ చేసుకున్నట్టే ఉంటుంది టపాసులు కొని పేలిస్తే. ఇటీవల గో గ్రీన్ అంటున్నారు, అంటే శబ్దాలు, కాలుష్యం బాగా తక్కువగా ఉన్న టపాసులు తయారీ చేస్తున్నారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు పలువురు. టపాసుల తయారీ దారులకు వేరే ఉపాధి చూపించి వారి చావులను ఆపాలని, దీపాలతో దీపావళి జరుపుకోవాలని, ఇలాంటి రోజు రావాలని ఆశిద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: