
అయితే ఇప్పుడు వరకు వధువు నచ్చలేదనో లేకపోతే తమ అభిరుచులు కలవలేదనో.. కొన్ని కొన్ని సార్లు కట్నం ఇవ్వలేదని.. ఇక పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటనలను చాలానే చూసాము. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది. ఎందుకంటే యువతికి తక్కువ మార్కులు వచ్చాయి అన్న కారణంతో పెళ్లి రద్దు చేశాడు వరుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. కానీ తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్నం కోసమే వరుడు ఇలాంటి డ్రామాలకు తెరలేపాడు అన్న విషయం తేలింది.
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా తిరువకోత్వలి ప్రాంతానికి చెందిన సోనీ అనే అమ్మాయిని బగన్వ గ్రామానికి చెందిన సోను అనే అబ్బాయి తో పెళ్లి నిశ్చయించారు. ఏడాది డిసెంబర్ 4వ తేదీన భారీగా ఖర్చుపెట్టి మరి సోనీ తండ్రి నిశ్చితార్థం కూడా చేశాడు. అయితే పెళ్లికి సమయం దగ్గర పడుతున్న టైం లో వరుడు ఊహించని షాక్ ఇచ్చాడు. సోనీ ఇంటర్మీడియట్ మార్కుల షీట్ చూసి అమ్మాయికి మార్కులు తక్కువగా వచ్చాయని ఆమెను పెళ్లి చేసుకోలేను అంటూ షాకింగ్ విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా అతను వినలేదు. ఇక ఆ తర్వాత అధిక కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని కొత్త కారణం చెప్పడంతో.. ఇక వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక ఇరు కుటుంబాలను సముదాయించి పెళ్లి చేసే పనిలో పడ్డారు అని చెప్పాలి.