కొజికోడ్ విమాన ప్రమాదం గురించి క్రమంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తీరు, అందుకు కారణాల గురించి ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ ప్రమాదం సమయంలో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని తెలుస్తోంది. వాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా.. మొత్తం విమానంలో ప్రయాణిస్తున్న 191 మంది ప్రాణాలు గాల్లో కలసిపోయేవని తెలుస్తోంది.


సాధారణంగా ఇలా విమానాలు కిందపడినప్పుడు ఫ్యూయల్ ట్యాంకర్లు పేలిపోయి.. అంతా సజీవ దహనం అవుతుంటారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఈ ప్రమాదం విషయంలోవిమాన పైలట్లు సకాలంలో ఇంజిన్లను ఆఫ్‌ చేసారు. దీనివల్ల విమానానికి మంటలు అంటుకోలేదు. అగ్ని ప్రమాదం జరగలేదు. అందువల్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గాయపడినా ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ విషయంలో పైలట్లు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. వారితో సహా ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగిలేవారు కాదని తెలుస్తోంది.  


విషాదం ఏంటంటే.. ఇంత మందిని కాపాడిన కొజికోడ్‌ విమాన ప్రమాదంలో పైలట్‌ దీపక్‌ సాథే , కో పైలట్‌ అఖిలేశ్‌ కుమార్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించగలిగారు. ఈ ప్రమాద సమయంలో విమానంలోని ఇంధనం అంటుకోకపోవడం వల్ల పెను ముప్పు తప్పింది. విమాన పైలట్‌ సకాలంలో ఇంజిన్‌ను ఆఫ్‌ చేయడం వల్ల ఈ గండం గడిచిందని కేంద్ర మంత్రి మురళీధరన్‌ కూడా చెప్పారు.

పైలట్లు చేసిన మరో గొప్ప పని ఏంటంటే.. ప్రమాదం తప్పదని తెలిసిన వారు.. ల్యాండింగ్‌కు ముందు విమానాన్ని పైలట్లు గాల్లో చక్కర్లు కొట్టించారు. దీని వల్ల చాలా వరకూ మిగులు ఇంధనం ఖర్చయిపోయింది. అందువల్ల ప్రమాద తీవ్రత చాలా వరకూ తగ్గింది. ఇదే సమయంలో కోజికోడ్ విమానాశ్రయంలోని నిర్వహణ లోపాలు కూడా ప్రమాదానికి దారి తీశాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: