అమరావతి రాజధాని  విషయంలో సరికొత్త వివాదం ముసురుకుంటోంది. అమరావతిపై ఇపుడున్న వివాదాలు చాలవన్నట్లు మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎల్లోబ్యాచ్ రెచ్చిపోతోంది. పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వటానికి అంగీకరించనపుడు అమరావతిలో శాసనరాజధాని మాత్రం ఎందుకుండాలి ? అంటూ నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అమరావతిలో అసెంబ్లీ కూడా అవసరం లేదని తాను జగన్మోహన్ రెడ్డితోనే నేరుగా చెప్పినట్లు కొడాలి చెప్పాడు. తాను చేసిన సూచననను జగన్ విన్నాడని అందరితోను చర్చిద్దామని చెప్పినట్లుగా నాని చెప్పిన విషయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. నాని తాజా మాటలు చూస్తుంటే మొత్తానికి అమరావతిలో రాజధానే అనేది లేకుండానే జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడనే అనుమానాలకు ఆస్కారం వచ్చింది.





అమరావతి రాజధాని విషయంలో అందరూ అనుమానిస్తున్నట్లే జరుగుతోందా ? తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమవుతోందంటూ ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. మంత్రి మాట్లాడుతూ అమరావతిలో అసలు శాసనరాజధాని కూడా అంటే అసెంబ్లీ కూడా వద్దంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. పైగా సిఆర్డీఏ పరిధిలోని పేదలు తనతో అన్న మాటలనే తాను జగన్ తో చెప్పినట్లు నాని సమర్ధించుకుంటున్నాడు.  మొన్న జనవరిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపికి మూడు రాజధానుల అవసరం ఉందంటూ చేసిన ప్రకటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జగన్ ప్రతిపాదన ప్రకారం అమరావతిలో శాసనరాజధాని మాత్రమే ఉంటుంది. వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది.





జగన్ ప్రతిపాదన ఎలాగున్నా రాష్ట్రంలో రాజకీయంగా మంటలు మొదలైపోయాయి. రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల్లోని ఓ ఆరేడు గ్రామాల్లో గడచిన 266 రోజులుగా ఏదో రూపంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. అప్పటి నుండి రైతులపై ప్రభుత్వానికి బాగా మంటగా ఉంది. ఇదే విషయం తాజాగా మంత్రి మాటల్లో బయటపడింది. తమతో పాటు పేదలు ఉండేందుకు ఇష్టపడని రాజధాని ప్రాంతవాసులకు అసలు అసెంబ్లీ మాత్రం ఎందుకని నాని నిలదీస్తున్నాడు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు విని అమరావతి ప్రాంత జనాలు మోస పోతున్నట్లు కూడా కొడాలి అన్నాడు.





పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటాన్ని అడ్డుకున్న అమరావతిలో అసలు శాసన రాజధాని మాత్రం ఎందుకుండాలంటూ మంత్రి పదే పదే ప్రశ్నిస్తున్నాడు. అందుకనే అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దని కొడాలి అభిప్రాయపడ్డాడు. అంతటి ఆగని మంత్రి తన అభిప్రాయాన్ని జగన్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలతో కూడా చెప్పానని తానే స్వయంగా చెప్పాడు. ఒకవేళ అమరావతిలో అసెంబ్లీ కంటిన్యు అవ్వాలని రాజధాని ప్రాంతం వాళ్ళుకుంటే పేదలకు పట్టాలు ఇవ్వటానికి ఒప్పుకోవాలని సూచించాడు. కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని షరతు కూడా పెట్టాడు. 55 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇద్దామని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని కోర్టుకెళ్ళి అడ్డుకోవటం విడ్డూరమంటూ మంత్రి రైతులపై మండిపడ్డాడు.





అమరావతి ప్రాంతంలో గడచిన 266 రోజులుగా జరుగుతున్న ఆందోళన అందరికీ తెలిసిందే. సరే ఆందోళనపై అధికారపార్టీ వాదన ఒకలాగుంటే ప్రతిపక్షాల వాదన మరోలా ఉంది. ఇపుడు జరుగుతున్న ఆందోళనలో ఎక్కువమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లే ఎక్కువగా ఉన్నారంటూ అధికారపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఆందోళన చేస్తున్నదంతా రైతులు, వాళ్ళ కుటుంబసభ్యులే అని టిడిపి+ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎవరి వాదన ఎలాగున్నా అసలు మూడు రాజధానుల ఏర్పాటు వల్ల అమరావతి ప్రాంతంలోని రైతులకు జరిగే నష్టం ఏమిటని అడిగితే మాత్రం ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికార వికేంద్రీకరణ జరగకూడదని మొత్తం అమరావతి ప్రాంతంలోనే ఉండాలని రైతుల డిమాండ్ విషయంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: