కరోనా బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే టీకా ఒక్కటే మార్గం.. కానీ ఆ టీకాలు అంత సులభంగా దొరకడం లేదు. 130 కోట్ల పైబడిన జనాభాలో ఇప్పటి వరకూ 40 శాతం మందికి కూడా టీకాలు ఇవ్వలేదు. ఇచ్చేందుకు టీకాలు తగినన్ని లేవు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. అయితే ఇకపై ఆ దిగులు తొలగిపోనుందట. ఈ విషయంపై కేంద్రం ఓ ప్రటన చేసింది. కరోనా కట్టడిలో అస్త్రాలైన టీకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో మరిన్ని సంస్థలకు చెందిన  టీకాలు అందుబాటులోకి రాబోతున్నాయట.


దేశంలో ఇప్పటికే మూడురకాల టీకాల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వ్యాక్సిన్లు వస్తే దేశంలో మరింతగా టీకా లభ్యత అవకాశాలు పెరగనున్నాయి. తాజాగా మరో నాలుగు వ్యాక్సిన్‌లు మానవులపై ప్రయోగాల్లో వేర్వేరు దశల్లో ఉన్నాయట. జెనిక్‌ లైఫ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేస్తున్న టీకా అడ్వాన్స్డ్‌ దశలో ఉందట.


పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. క్యాడిలా హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉందట. ఈ సంస్థ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ మధ్యంతర డేటాను సమర్పించిందట. ఇక హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ తయారు చేస్తున్న టీకాతో పాటు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తున్న ఎడెనో ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ కూడా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయట.


జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌ ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకా మొదటి దశ ట్రయల్స్‌లో ఉందట. జెనిక్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ అడ్వాన్స్డ్‌ ప్రీ క్లినికల్‌ దశలో ఉందట. మొత్తానికి త్వరలోనే దేశంలో టీకాల కొరత తీరబోతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: