కేంద్రం ఏమీ చేయడం లేదన్నది తెలంగాణ రాష్ట్ర సమితి నేతల ఆరోపణ. అబ్బే మేం అన్నీ చేస్తూనే ఉన్నాం.. కొన్నింటికి రాష్ట్రమే చొరవ చూపడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ఈ పరంపరలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాసి చిక్కుల్లో పడేశారు. అసలు విషయం ఏంటంటే.. రామగుండంలో కేంద్ర ప్రభుత్వం 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకుంటోంది. అయితే.. దీనికి అవసరమైన భూమిని రాష్ట్రం కేటాయించాల్సి ఉంది.


అయితే.. తాము కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి కట్టిస్తామంటున్న సరైన స్థలం చూపించట్లేదని ఈ లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.     కార్మికశాఖ మంత్రి గారు వారి లేఖలో తెలిపినట్లుగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని రామగుండం పట్టణ శివార్లలో చూపించారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే.. ఈ భూమి పరిశీలన కోసం ESI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ వారు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ కమిటీ ఆ భూమిని పరిశీలించి ఒక నివేదికను అందించని తన లేఖలో వివరించారు.


కమిటీనివేదిక ప్రకారం ఆ స్థలం ఆసుపత్రి నిర్మాణం కోసం యోగ్యమైనది కాదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేటాయించిన భూమిని గతంలో రామగుండం మునిసిపాలిటీ వారు డంపింగ్ యార్డుగా ఉపయోగించేవారట. ఆ భూమికి చుట్టుప్రక్కల 2 స్మశాన వాటికలు ఉన్నాయట. ఈ భూమిని చేరుకోవడానికి నేరుగా దారి లేదట. ప్రస్తుతం భూమి ప్రక్కనే ఉన్న పార్కు మధ్యగా నడిచి వెళ్లాలని, బస్టాండు లేదా రైల్వే స్టేషన్ నుండి కార్మికులు ఇక్కడకు చేరుకోవడానికి కూడా దూరమవుతుందట. కార్మికులకు అనుకూలంగా లేని అనేక కారణాల రీత్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపించిన భూమి ఆసుపత్రి నిర్మాణానికి అనువైనది కాదని భూమి పరిశీలన చేసిన నిపుణుల కమిటీ సభ్యులు తమ యొక్క నివేదికలో తెలిపారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు.


అందుకే కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండేలా ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్‌ను కోరారు. మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: