తప్పొప్పులు ఎవరికైనా ఒకే విధంగా ఉంటాయి.  ఒకే పనిని ఒకరు చేస్తే తప్పుగాను మరోకరు చేస్తే ఒప్పుగాను చిత్రీకరించలేరు. ఇదంతా దేనికంటే జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో పోలికి చెప్పటానికే. చరిత్రను చెప్పకుండానే ఆదివారం హై కోర్టు తీర్పు విషయం తర్వాత పరిణామాలను మాత్రమే చర్చించుకుందాం. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ తొలగింపు తప్పని కోర్టు చెప్పింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లదంటూ హై కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు హైలైట్స్ టీవీల్లో బ్రేకింగ్  న్యూస్ రూపంలో రావటమే ఆలస్యం. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన పనేమిటయ్యా అంటే ఎన్నికల కమీషన్ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ కు ఫోన్ చేసి రాజీనామా చేయమని ఆదేశించాడు.

 

లాయర్ ను ఎందుకు రాజీనామా చేయమని ఆదేశించాడంటే ఎన్నికల కమీషన్ లో కొత్త రక్తం ఎక్కించేందుకట. కమీషన్లో కొత్త రక్తం ఎక్కించేందుకు ఇపుడున్న లాయర్ రాజీనామా చేయటానికి ఏమిటి సంబంధమో నిమ్మగడ్డ చెప్పలేదు. సరే నిమ్మగడ్డ ఆదేశించాడు కాబట్టి రాజీనామా చేస్తానని చెప్పిన లాయర్ అందుకు కొంత వ్యవధి అడిగాడు. దానికి నిమ్మగడ్డ ఒప్పుకోకుండా వెంటనే రాజీనామా చేయాల్సిందే అంటూ స్పష్టంగా చెప్పేశాడు. హై కోర్టు తీర్పు రాగానే ప్రభుత్వం రెస్పాన్స్ కోసం కూడా నిమ్మగడ్డ ఎదురు చూడలేదు. చాలా మందికి చాలా ఆదేశాలిచ్చేశాడు. సరే సాయంత్రం అయ్యేసరికి వ్యవహారం అంతా బోల్తాపడిందనుకోండి అది వేరే సంగతి.

 

సీన్ కట్ చేసి కరోనా వైరస్ కాలంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన కాలానికి వెళదాం. ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేస్తు అప్పట్లో నిమ్మగడ్డ చేసిన ప్రకటన సంచలనమైంది. ఎందుకంటే నిమ్మగడ్డ నిర్ణయాన్ని అందరితో పాటు చివరకు జగన్మోహన్ రెడ్డి కూడా టీవీల్లోనే తెలుసుకోవాల్సొచ్చింది. అంటే ఎన్నికల వాయిదా లాంటి అతిముఖ్యమైన నిర్ణయాన్ని కూడా నిమ్మగడ్డ ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా ప్రకటించేశాడు. దాంతో జగన్ కు ఒళ్ళుమండి నిమ్మగడ్డను తప్పించేందుకు ఆర్డినెన్సు జారీ చేయించాడు.

 

ఇక్కడ నిమ్మగడ్డను తప్పించేందుకు జగన్ చేసింది తప్పా ? లేకపోతే స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమనటంలో నిమ్మగడ్డ తప్పు చేశాడా అని కాదు. నిమ్మగడ్డ స్ధాయిలో  నిమ్మగడ్డ నిర్ణయం తీసుకుంటే, జగన్ స్ధాయిలో జగన్ నిర్ణయం తీసుకున్నాడు. తప్పయితే ఇద్దరు చేసిందీ తప్పే. లేకపోతే ఇద్దరు చేసిందీ ఒప్పే అనుకోవాలి. అసలు సమస్యంతా ఎక్కడ మొదలైంది ? జరుగుతున్న ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేస్తు నిమ్మగడ్డ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తప్పు. నిమ్మగడ్డ చేసింది తప్పని జనాలు అనుకోవటం కాదు. స్వయంగా సుప్రింకోర్టే చెప్పిందీమాట.

 

అయితే ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆ విషయంజోలికి వెళ్ళటం లేదని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. అందుకే ఈసారి ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయం కచ్చితంగా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయించాలని నిమ్మగడ్డకు సుప్రింకోర్టు తలంటిపోసింది. కాకపోతే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా మాత్రం అప్పటి సుప్రింకోర్టు తీర్పునైనా, తాజాగా హై కోర్టు తీర్పులో తమకు కావాల్సిన అంశాన్ని మాత్రమే పట్టుకుని ఊగులాడుతున్నాయి.  మొత్తం మీద టామ్ జెర్రీ షో లాగ మొదలైన ప్రభుత్వం-నిమ్మగడ్డ వ్యవహారం ఎప్పటికి ఏ రూపంలో ముగుస్తుందో చూడాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: