అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంతకాలం కరోనా వైరస్ ఒకటే అనుకుంటే తాజాగా నల్లజాతీయుడి మరణం కూడా తోడయ్యింది. వారం రోజుల క్రితం మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపోలీసు నగరంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఓ తెల్లపోలీసు దారుణంగా చంపటంతో గొడవలు మొదలయ్యాయి. మిన్నెపోలీసు నగరంలో చిన్నగా మొదలైన ఆందోళన ఇపుడు సుమారు 30 నగరాలను అట్టుడికించేస్తోంది.  ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయే కానీ ఏమాత్రం తగ్గటం లేదు. దాంతో ఆందోళనలను ఎలా అదుపు చేయాలో ట్రంప్ కు అర్ధం కావటం లేదు. ఒకవైపు నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మరోవైపు కరోనా సమస్యకు తోడు ఫ్లాయిడ్ హత్య.

 

ఒకవైపు కరోనా వైరస్ విజృంభణ.  మరోవైపు జాత్యంహంకార ఘర్షణలు. మొత్తానికి అగ్రరాజ్యం అట్టుడుకిపోతోంది. కరోనా వైరస్ దాదాపు రెండు నెలలుగా అమెరికా మొత్తాన్ని వణికించేస్తోంది. మధ్యలో కొద్ది రోజులు తగ్గినా మళ్ళీ పెరిగిపోతోంది.  దాంతో వైరస్ ను ఎలా అదుపు చేయాలో తెలీక,  లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్న జనాలపై చర్యలు తీసుకోలేక అమెరికా ప్రభుత్వం నానా అవస్తలు పడుతుంది. ఇటువంటి సమయంలోనే మిన్నెపోలీసులో దాదాపు వారం క్రితం జరిగిన జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణంతో అమెరికాలో ఒక్కసారిగా జనాగ్రహం పెరిగిపోతోంది.

 

వారం క్రితం మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపోలిస్ నగరంలో ఓ నల్లజాతీయుడిని తెల్ల పోలీసు రోడ్డుపై పడేసి మెడపై కాలుపెట్టి అదిమి చంపేశాడు. ఈ ఘటన వీడియోల్లో వైరల్ అయ్యింది. ఘటనకు నేపధ్యం సరిగ్గా ఎవరికీ తెలీదు. నల్లజాతీయుడి మెడపై తెల్ల పోలీసు కాలుపెట్టి అదిమేయటం అందరికీ స్పష్టంగా కనబడింది. తర్వాత సహచరులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించి నల్లజాతీయుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పటికే బాధితులు మరణించాడు.

 

ఎప్పుడైతే విషయం వెలుగులోకి వచ్చిందో వెంటనే గొడవలు మొదలయ్యాయి. అమెరికాలో జాత్యంహాకరం, నల్లజాతీయులపై వివక్ష ఇంకా పోలేదంటూ నల్లజాతీయునికి మద్దతుగా లక్షల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చేశారు. నల్లజాతీయుడికి మద్దుతుగా ఆందోళన చేస్తున్న వాళ్ళల్లో తెల్లవాళ్ళు కూడా ఉండటం గమనార్హం. ఐదు రోజుల క్రితం మిన్నెపోలీసులో మొదలైన ఆందోళనలు ఇపుడు 22 నగరాలకు పాకింది. డెట్రాయిట్, న్యూయార్క్, లాస్ ఏంజెలిస్, అట్లాంటా, డెన్వర్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ లాంటి మరో 12 నగరాల్లో ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించిందంటే పరిస్దితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం అవుతోంది.

 

మిన్నెపోలీసు, లాస్ ఏంజెలీస్ నగరాల్లో ఆందోళనకారులు కనిపించిన షాపులు, కార్యాలయాలు, రెస్టారెంట్లు, వాహనాలన్నింటినీ తగలబెడుతున్నారు. రోడ్లపైకి చెత్త కుప్పలు పడేసి తగలబెట్టేస్తున్నారు. పోలీసులపైకి రాళ్ళు విసురుతున్నారు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద తాజా ఆందోళనల్లో నలుగురు చనిపోగా చాలామంది పోలీసులకు కూడా గాయలయ్యాయి. దాదాపు 2 వేలమందిని పోలీసులు అరెస్టులు చేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఘటన వెలుగులోకి వచ్చిందో వెంటనే తెల్లపోలీసు మీద  మిన్నెపోలిసు పోలీసులు కేసు పెట్టి అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో విషయం తెలిసిన వెంటన సదరు పోలీసు భార్య విడాకులు కూడా ఇచ్చేసింది. పోలీసు మీద విచారణ కూడా మొదలైంది. అయినా ఆందోళనకారులు మాత్రం తమ ఆందోళనలను రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. రెండు వైపుల మొదలైన మద్దెల మోతతో ట్రంప్ లో టెన్షన్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: