రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేళ  కాంగ్రెస్ పార్టీలో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి గుజ‌రాత్ రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వ‌రుస‌గా గుడ్‌బై చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ రాష్ట్రంలో ఉన్న‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి నాలుగు స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశం కాంగ్రెస్ ఉండేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే వ‌రుస‌గా ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో రాజ్య‌స‌భ సీట్ల గెలుపుపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక అస‌లు కారణాలేంట‌ని ఆరా తీసే ప‌నిలో అధినేత్రి సోనియా నిమ‌గ్న‌మ‌య్యారు. 

 

పార్టీ నుంచి ఎవ‌రూ వెళ్ల‌కుండా ఆమె ముఖ్య‌నేత‌ల‌తో మాట్లాడుతుండ‌టం విశేషం. అయితే రాజీనామాలు ఆగుతాయా..? ప పెరుగుతాయా..? అనేది  ఆస‌క్తిగా మారింది.  రాజ్యసభ ఎన్నికల్లో కనీసం సిట్టింగ్‌ స్థానాల్లో గెలిచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ జోరుకు  కళ్లెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఇది క‌చ్చితంగా ఎదురు దెబ్బలుగానే పరిగ‌ణించాల్సి ఉంటుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు.  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 19న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. 

 

బీజేపీ తరపున అభయ్ భరద్వాజ్, రమిలా బరా, నరహరి అమిన్ పోటీ చేస్తుండగా శక్తికాంత్ గోహిల్, భరత్ సింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీ తపున పోటీలో ఉండ‌టం గ‌మ‌నార్హం.  అయితే ఇలాంటి స‌మ‌యంలో గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఝ‌ల‌క్ ఇచ్చారు. కర్జాన్  నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాద నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే జితూ చౌదరి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. తమ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని కోరుతూ  స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి  అందజేయ‌డం, ఆయ‌న వెంట‌నే వాటిని ఆమోదించ‌డం చ‌క‌చ‌క జ‌రిగ‌డం విశేషం.  లాక్‌డౌన్‌కు ముందు కొద్ది రోజుల ముందే మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని క్ర‌మ‌శిక్ష‌ణ‌, అనైక్య‌త మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన‌ట్ల‌యింది. వాస్త‌వానికి గుజరాత్ నుంచి నలుగురు ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉండ‌గా ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల‌తో  గండిప‌డిన‌ట్ల‌యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: