స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల కమీషనర్ అయిన తనను ప్రభుత్వం వేధిస్తోందని, రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమీషన్ను ప్రభుత్వం గుర్తించటం లేదంటూ గోల చేస్తున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా పరిష్కారమయ్యే చిన్న చిన్న విషయాలపైన  కూడా కోర్టులో కేసులు వేసి నానా గోల చేస్తున్నారు. తాజాగా తాను అడిగిన వాటిని ప్రభుత్వం సమకూర్చటం లేదంటూ కోర్టుకెక్కారు. కోర్టు కూడా నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేసింది.  సరే కోర్టు ప్రభుత్వానికి విరుద్దంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసిందనే విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి విరుద్ధంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేసింది ? ఏ పరిస్దితుల్లో చేసింది అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిమ్మగడ్డ వ్యవహారాన్నే తీసుకుంటే మొదటినుండి వివాదాస్పదంగానే ఉందన్నది మాత్రం స్పష్టంగా కనబడుతోంది.




ప్రభుత్వానికి-ఎలక్షన్ కమీషన్ కు సమస్య అసలు నిమ్మగడ్డ వైపు నుండే మొదలైంది. ఎంతసేపు ఎన్నికల కమీషన్ అన్నది రాజ్యాంగబద్దమైన సంస్ధ అని అంటున్నారే కానీ ప్రభుత్వం కూడా శాసన వ్యవస్ధ ద్వారా ఏర్పడిందే అన్న విషయాన్ని నిమ్మగడ్డ మరచిపోతున్నారు. శాసనవ్యవస్ధ ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ గుర్తించటానికి ఇష్టపడనపుడు నిమ్మగడ్డను మాత్రం ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది ? ఇక్కడ ఓ సింపుల్ లాజిక్ ఉంది. మనకు ఎదుటి వాళ్ళు మర్యాద ఇవ్వాలని అనుకున్నపుడు ముందుగా మనమే ఎదుటి వాళ్ళకు మర్యాదు ఇవ్వాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనకు మర్యాదిస్తారు. ఇంతటి సింపుల్ లాజిక్ మిస్సయిన నిమ్మగడ్డ ఎంతసేపు తన యాంగిల్లోనే ఆలోచిస్తు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నపుడు ముందుగా ఆ ముక్కేదో ప్రభుత్వంతో చర్చించి ఉంటే బాగుండేది.




ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఎన్నికల వాయిదాపై తనిష్టం వచ్చిన నిర్ణయాన్ని తీసుకునుంటే నిమ్మగడ్డను ఇపుడు ఎవరు తప్పుపట్టే అవకాశం ఉండేదికాదు. అలా కాకుండా ప్రభుత్వంతో చర్చించటానికి ఏమాత్రం ఇష్టపడని నిమ్మగడ్డ స్ధానిక సంస్ధల ఎన్నికలను  ఏకపక్షంగా వాయిదా వేసేయటంతోనే  సమస్య మొదలైంది.  ముఖ్యమంత్రి ఇష్టం మీద అపాయింట్ అయిన నిమ్మగడ్డకే విధి నిర్వహణలో  ఇంత ఇగో ఉన్నపుడు మరి 4 కోట్ల మంది ఓటర్లలో  మెజారిటి ఓటర్ల మద్దతుతో అఖండ మెజారిటి సాధించి ముఖ్యమంత్రయిన వ్యక్తికి ఇంకెంత ఇగో ఉండాలి ? అదేదో సినిమాలో చెప్పినట్లుగా  ఇగో అన్నది ప్రతి వ్యక్తికి ఏదో స్ధాయిలో ఉంటుంది. అది సదరు వ్యక్తిస్ధాయిని బట్టి ఎక్కువ తక్కువంతే. ఎలక్షన్ కమీషనర్ పదవిని భర్తీ చేసేదే ముఖ్యమంత్రయినపుడు మరి ముఖ్యమంత్రికి ఇంకెంత ఇగో ఉండాలి ?  పైగా తన చర్యల ద్వారా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాననే సంకేతాలను నిమ్మగడ్డ స్పష్టంచేశారు.




చంద్రబాబునాయుడు హయాంలో నియమితులైన నిమ్మగడ్డ తన చర్యల ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నట్లు సంకేతాలు పంపిన తర్వాత  జగన్మోహన్ రెడ్డి కూడా  అదే స్ధాయిలో స్పందించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్ధాయికి చేరుకుంది. ఇపుడు కూడా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నిమ్మగడ్డ ముందు రాజకీయపార్టీలతోనే సమావేశం నిర్వహించటం గమనార్హం. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిమ్మగడ్డ ప్రభుత్వంతో చర్చించారు.  అందుకనే మెజారిటి రాజకీయ పార్టీలు ఎన్నికలను నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారని, ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన ఎన్నికలను కూడా రద్దు చేయాలని అభిప్రాయపడినట్లు కోర్టుకు చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే ప్రతి విషయంలోను ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖిరినే అవలంభించాలని నిమ్మగడ్డ గట్టిగా ఫిక్సయిపోయినట్లు అర్ధమైపోతోంది. ఇటువంటి విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: