అన్ని రాజకీయ పార్టీలు తమ అజెండాను జనాల ముందుకు తీసుకువెళ్లే విషయం పైనే కాకుండా , తమ శత్రువులను బలహీనం చేయడం ద్వారానే తాము బలోపేతం అవ్వచ్చు అనే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు గా వ్యవహరిస్తున్నాయి. ఏపీలోనూ, తెలంగాణలో ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. అసలు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇదే ఫార్ములాను వాడేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమకు ఎదురే లేకుండా ఉంటే ఖచ్చితంగా తాము అన్ని విషయాల్లోనూ నెగ్గుకు రాగలము అనే అభిప్రాయానికి అన్ని పార్టీలు వచ్చేశాయి. 



ఈ క్రమంలోనే ప్రతి పార్టీ వలసల పైనే పూర్తిగా దృష్టి సారించి, వలసలను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ, వారు తమ పార్టీలో చేరితే, ఏ బెనిఫిట్స్ ఇస్తాము అనే వాటిని ప్రస్తావిస్తూ హడావుడి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రచారంపై ఎంతగా దృష్టిపెడుతున్నా రో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయం పైన దృష్టి సారిస్తూ, ఆ పార్టీలోని అసంతృప్తులను గుర్తించి తమ దారిలోకి తెచ్చుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలనే తీసుకుంటే , ఇక్కడ అన్ని పార్టీలు వలసల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. 



అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ను బలహీనం చేసి,  తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. అలాగే బీజేపీలోని అసంతృప్తులను గుర్తిస్తూ,  దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండగా, బిజెపి సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించుకుని గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలింగ్ తేదీ వరకు ఇదే విధంగా పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేందుకు అటు బిజెపి ఇటు టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రకమైన రాజకీయ వాతావరణం గతంలో ఉన్నా, ఇప్పుడున్నంత స్థాయిలో మాత్రం లేదు. ఈ తరహా రాజకీయ పరిణామాలు ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: