క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గెలుపు అవకాశాలు లేకపోతే కోర్టులో కేసులు వేయించటం చంద్రబాబునాయుడుకు మొదటినుండి ఉన్న అలవాటు. తాజాగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఫలితాన్ని నిలిపేయాలని బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ కోర్టులో కేసు వేశారు.  కోర్టులో కేసు వేస్తే గీస్తే టీడీపీనే వేస్తుందని అనుమానిస్తున్నారు. అలాంటిది బీజేపీ అభ్యర్ధి కేసు వేయటమంటే ఆశ్చర్యమే. బీజేపీ కేసు వేయటం ఎందుకు ఆశ్చర్యమంటే ఉపఎన్నికలో కమలంపార్టీకి అసలు డిపాజిట్ వస్తుందని కూడా ఎవరు అనుకోవటంలేదు. మొదట్లో గెలుపుమీద ఆశలు పెట్టుకున్న చంద్రబాబు కూడా మధ్యలోనే కాడి దింపేశారు. కాబట్టి గెలుపు అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే అది టీడీపీకి మాత్రమే.




నిజానికి పోయిన ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 4.94 లక్షల ఓట్లు మళ్ళీ తెచ్చుకుంటే అదే చాలాగొప్పగా టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. సరే గెలుపోటములను పక్కనపెట్టేస్తే లోక్ సభ పరిధిలోని అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు, నేతలతో పాటు ఓటింగ్ కూడా ఉంది కాబట్టి టీడీపీ గెలుపుమీద ఆశలు పెట్టుకుందంటే ఏదోలే అనుకోవచ్చు. మరి డిపాజిట్ కూడా వచ్చేది అనుమానమే అనుకున్న బీజేపీ ఎందుకు కేసు వేసింది ? ఎందుకంటే టీడీపీనే బీజేపీ నేతలతో మాట్లాడి రత్నప్రభతో కేసు వేయించిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే కోర్టులో కేసు వేసి పోరాటం చేసేంత సీన్ రత్నప్రభకు లేదని బీజేపీ నేతలే అంటున్నారు. టీడీపీ అయినా బీజేపీ అయినా లోక్ సభ పరిధిలోని తిరుపతిలో మాత్రమే దొంగఓట్లు పడ్డాయని ఆరోపించారు.




మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అంటే అక్కడంతా పోలింగ్ ప్రశాంతంగానే జరిగినట్లు లెక్క. మొదట్లో తిరుపతి అసెంబ్లీ పరిధిలోనే రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేసిన పార్టీలు ఇపుడు ఏకంగా ఉపఎన్నిక మొత్తాన్ని  రద్దుచేయాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి ? ఒక నియోజకవర్గంలో దొంగఓట్లు పడితే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికను కేంద్ర ఎన్నికల కమీషనర్ రద్దుచేస్తుందా ? నిజానికి ఆరోపణలు చేసేవారే ఆధారాలు కూడా సమర్పించాలి. 2 లక్షల దొంగఓట్లు పడ్డాయని ఆరోపిస్తున్న చంద్రబాబు అండ్ కో నే అందుకు ఆధారాలను అందించాలి. ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని దొంగఓట్లు పడ్డాయనే విషయాన్ని ఆధారాలను చూపకుండా హోలు మొత్తం మీద దొంగఓట్లు పడ్డాయి కాబట్టి ఏకంగా ఎన్నికనే రద్దు చేయమని అడగటమంటే ఇది చంద్రబాబు స్టైల్ తప్ప మరోటికాదు. అందుకనే చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీ నడుస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: