
ప్రాణావసరాలైన మందుల విషయంలో కూడా మన ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న విషయం అర్ధమైపోతోంది. ఎంత విపత్కర పరిస్దితుల్లో అయినా డబ్బు చేసుకోవటమే టార్గెట్ గా ఆసుపత్రులు, కంపెనీలు చెలరేగిపోతున్నాయి. ఒకవైపు కోవీషీల్డ్ టీకాల అధికధరపై గోల జరుగుతున్న సమయంలోనే కోవాగ్జిన్ టీకా ధరను అంతకన్నా ఎక్కువగా భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ టీకాను కూడా కేంద్రానికి 150 రూపాయలకే అందిస్తారట. రాష్ట్రప్రభుత్వాలకు రు. 600కి, ప్రైవేటు ఆసుపత్రులకు రు. 1200కి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో కోవాగ్జిన్ ధరలను చూసిన తర్వాత కోవీషీల్డ్ ధరలే నమయని అనిపిస్తోంది. వీటి పరిస్ధితి ఇలాగుండగానే రెమ్ డెసివర్ ఇంజక్షన్ల ధరలు బ్లాకులో రు. 40 వేలకు చేరుకోవటం మరీ దారుణంగా ఉంది.
నిజానికి కోవీషీల్డ్ అయినా కోవాగ్జిన్ అయినా తమకు కేంద్రం ఉచితంగా సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణాధారమైన టీకాలను ఉచితంగానే వేయాలని జనాలు కూడా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల డిమాండ్లను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. దాంతో ప్రజలకు అవసరమైన టీకాలను ఉచితంగా వేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలిపై జనాలు మండిపోతున్నారు. సీరమ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ కేంద్రానికి 150 రూపాయలకు, రాష్ట్రప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు రు. 600కు అందించనున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవీషీల్డ్ ప్రకటించిన ధరలే చాలా ఎక్కువగా ఉందని జనాలు అనుకుంటున్న సమయంలోనే అంతకన్నా ఎక్కువ ధరలను కోవాగ్జిన్ టీకాకు భారత్ బయోటెక్ ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది.
అంటే టీకాల విషయంలో జనాలను నరేంద్రమోడి ఎవరి ఖర్మానికి వాళ్ళని వదిలేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒకవైపేమో ఓట్లకోసం, అధికారం కోసం పశ్చిమబెంగాల్లో అధికారంలోకి వస్తే టీకాలు అందరికీ ఉచితంగా వేయిస్తామని బీజేపీ ప్రకటించింది. ఇదే సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేసుకోవాలని స్పష్టంగా చెప్పేసింది. మోడి అనుసరిస్తున్న ఇలాంటి ద్వంద్వ విధానాలపైనే జనాలు మండిపోతున్నారు. వ్యాక్సిన్ కు కేంద్రం కేటాయించిన రు. 35 వేల కోట్లు, పీఎం కేర్స్ కు వచ్చిన రు. 25 వేల కోట్లంతా ఎటుపోయాయని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అయినా మోడి ఎవరికీ సమాధానం చెప్పటంలేదు. ఒకవైపు టీకాలు దొరకటంలేదు. మరోవైపు ఆక్సిజన్ అందక జనాలు మరణిస్తున్నారు. అయినా కేంద్రంలో పెద్దగా చలనం కనబడటంలేదు. సుప్రింకోర్టు, హైకోర్టులు క్రియాశీలకం కావటం వల్లే దేశంలో పరిస్ధితులు కాస్తయినా అదుపులో ఉన్నాయి. మరి టీకాల ధరల విషయంలో కూడా కోర్టులో జోక్యం చేసుకుంటాయోమో చూడాలి.