ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అప్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఆస్తులు తాకట్టు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ది సంస్థ ద్వారా డబ్బులు ఇస్తామన్న బ్యాంకులు కూడా ముఖం చాటేస్తున్నాయి. కేంద్రం రాస్తున్న లేఖలు, సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమీకరించిన నిధులు రిజర్వ్ బ్యాంకు ఓడీకి జమ వేసుకోవడం, కేంద్రం 17 వేల కోట్ల రూపాయల రుణ పరిమితికి మించి అప్పు చేశారని తాఖీదు పంపడం వంటి సంఘటనలు బ్యాంకులను ఆందోళనలోకి నెట్టాయి. ఈలోపు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విడుదల చేసిన కేంద్రం లేఖ, బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందం పత్రాలు బహిర్గతం చేయడం, మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ అంశం కేంద్రం వరకూ వెళ్లింది. రాష్ట్రంలో విలువైన ఆస్తులు తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ది సంస్థ ద్వారా 25వేల కోట్లు రుణం ప్రతిపాదించడం, ఇందులో ఇప్పటికే 21,500 కోట్లు సేకరించడంతో ఈ సమాచారం తమకు ఎందుకు చెప్పలేదని కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పులు తీసుకు రావడం సహజమని, అమాత్యులు చెబుతున్నప్పటికీ.. ఏపీలో పరిమితి దాటిందనే దానిపైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఏపీలో రాష్ట్రాభివృద్ది సంస్థను ఏర్పాటు చేసి దానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి, బ్యాంకుల కన్సార్టియం నుంచి 21వేల 500 కోట్లు రుణం తీసుకువచ్చారు. అయితే బ్యాంకులు కోరడంతో విశాఖపట్నంలో విలువైన 214 ఎకరాల భూమి, పలు నిర్మాణాలను తనఖా పెట్టారు. ఈ బ్యాంకుల కన్సార్టియం మరో 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధుల కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇదిగో, అదిగో అంటూ బ్యాంకులు వాయిదా వేస్తూ వస్తున్నాయి. అప్పు రేపు అనే బోర్డును కన్సార్టియం పెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ 3,500 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముఖం చాటేశాయని సమాచారం. అటు కేంద్రం నుంచి రుణ పరిమితి సడలించేందుకు అనుమతి రాకపోవడం, ఇటు బ్యాంకులు ముఖం చాటేయడంతో ఆగష్టు గడిచేదెలా అనే ఆందోళన అధికారుల్లో ప్రారంభమైంది.

వాస్తవానికి వచ్చే నెలలో ఆసరా పథకం కింద రూ.7,500 కోట్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సామాజిక భధ్రత పెన్షన్లు, తీసుకువచ్చిన రుణాలకు వడ్డీల రూపేణా మరో రూ. 10,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆసరా పధకాన్ని అమలు చేయాలంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వచ్చే నెలలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. అప్పు తెచ్చేందుకు అన్నిదారులు మూసుకుపోవడంతో ఇప్పుడు ఏం చేయాలనే అంశంపైనే ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతంలో ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆర్ధికశాఖలో చిటికెలో పని చేసుకుని వచ్చే రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఇప్పుడు వారం గడిచినా ఢిల్లీలోనే కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. మొత్తంమీద ఆగస్ట్‌ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: